దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇటీవల భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఇంటికి చేరుకున్నారు. తాజాగా నాసా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా భారత్ గురించి సునీత చేసిన వ్యాఖ్యలు మనందరినీ గర్వపడేలా చేశాయి.
“అంతరిక్షం నుంచి భారత్‌ను చూడటం ఒక అద్భుత అనుభవం. ప్రతిసారీ హిమాలయాల మీదుగా వెళ్తున్నప్పుడు మేఘాలు తొలగితే మంచుతో కప్పబడిన పర్వతాలు స్వర్గంలా కనిపించేవి,” అని చెప్పిన సునీతా, ఆ దృశ్యాలను బుచ్ విల్మోర్ తన కెమెరాలో బంధించేవాడని చెప్పింది. గుజరాత్, ముంబై తీరప్రాంతాలు స్పష్టంగా కనిపించేవని, సముద్రంలో మత్స్యకారుల పడవలు కూడా సిగ్నల్స్‌లా కనిపించేవని తెలిపారు.
ఇంత అందమైన దృశ్యాలను చూస్తే తన తండ్రి పుట్టిన దేశాన్ని ప్రత్యక్షంగా చూసే కోరిక మరింత పెరిగిందని సునీత చెప్పింది. “భారత్‌కి త్వరలోనే రావాలనుకుంటున్నాను. ఇక్కడి ప్రజలతో మాట్లాడాలని, నా అనుభవాలను వారితో పంచుకోవాలని ఉంది,” అని పేర్కొంది. భారత్ గురించి మాట్లాడుతూ ఇది గొప్ప ప్రజాస్వామ్యం, విశ్వవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ఎదుగుతున్న దేశంగా అభివర్ణించారు.
తనలో భారత మూలాలు ఉండటం, తన పేరులో భారతీయత ఉండటం గర్వంగా ఉందని తెలిపింది సునీతా. అంతరిక్ష ప్రయాణాల తర్వాత కూడా తన గుండె నిండేది భారత్ పై ప్రేమతోనే అని స్పష్టం చేసింది. ప్రపంచానికి భారత్ చూపించిన మార్గం, శాంతిని కోరే ప్రజల తత్వం అద్భుతమని కొనియాడింది. భారత్‌కి రావాలన్న సునీతా ప్రకటనతో దేశంలో ఆమెను స్వాగతించేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు.