Sprouted: మొలకెత్తిన మెంతులు.. డయాబెటిస్ నుంచి కొలెస్ట్రాల్ వరకూ హాట్ ఫేవరెట్..!

ఒకప్పుడు వంటల్లో పరిమితంగా ఉపయోగించిన మెంతులు ఇప్పుడు ఆరోగ్య ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మొలకెత్తిన మెంతులు.. నగర జీవనశైలిలో కొత్త ఆహార ట్రెండ్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని సూపర్‌మార్కెట్లు, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ స్టోర్స్‌లో ఈ స్ప్రౌట్స్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. రోజువారీ ఆహారంలో ఆరోగ్యాన్ని కోరుకునే వారు వీటిని ప్రత్యేకంగా వెతుక్కుంటూ కొనుగోలు చేస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మొలకెత్తిన మెంతులు పోషక విలువలతో నిండిన ఆహారం. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరానికి లోపలి నుంచే మేలు చేస్తాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ స్థాయిల నియంత్రణలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇవి సహాయకారిగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే డయాబెటిక్‌లు, జీవనశైలి వ్యాధులతో బాధపడే వారు వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

రుచికి రాజీపడకుండానే ఆరోగ్యాన్ని పొందొచ్చన్న భావనతో మొలకెత్తిన మెంతులు వంటగదిలోకి ప్రవేశిస్తున్నాయి. సలాడ్లలో, సూప్‌లలో, దోస, ఇడ్లీ బ్యాటర్‌లో, మిక్స్ వెజిటబుల్ వంటకాల్లో చేర్చుకుంటూ కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. సాధారణ మెంతుల కంటే కొద్దిగా మృదువైన రుచి ఉండటంతో యువతలోనూ ఆదరణ పెరుగుతోంది. అయితే, ఆరోగ్యానికి మంచిదన్న కారణంతో పెసలు, మోతాదు మించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా తీసుకుంటే గ్యాస్, అజీరనం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, అలెర్జీ సమస్యలున్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

డిమాండ్ పెరుగుతుండటంతో రైతులు, మార్కెటర్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఫ్రెష్ స్ప్రౌట్స్ పేరుతో ప్రత్యేక ప్యాకేజింగ్, డోర్ డెలివరీ సేవలను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం వైపు ప్రజలు అడుగులు వేస్తున్న ఈ సమయంలో, మొలకెత్తిన మెంతులు, పెసలు ఒక సాధారణ వంట పదార్థం నుంచి ఆరోగ్య ప్రతీకగా మారుతున్నాయి.