ఒకప్పుడు చేతికి వాచ్ అంటే విలాసం, తర్వాత అవసరం. కానీ మొబైల్ ఫోన్‌ల రాకతో రిస్ట్ వాచ్ డిమాండ్ తగ్గిపోయింది. అయినా ఫ్యాషన్‌గా వాచ్ పెట్టుకునే అలవాటు కొనసాగింది. ఇప్పుడు ఆ స్థానం మొత్తం స్మార్ట్‌వాచ్‌లు ఆక్రమించుకున్నాయి. టైమ్ చెప్పడం మాత్రమే కాదు, ఫిట్‌నెస్ ట్రాకింగ్, హార్ట్‌రేట్ గమనించడం, నిద్రను మానిటర్ చేయడం, కాల్స్, మెసేజ్‌లు స్వీకరించడం వంటి అనేక సౌకర్యాలు అందిస్తూ స్మార్ట్‌వాచ్‌లు జీవనశైలిలో భాగమయ్యాయి. కానీ నిపుణులు చెబుతున్నదేమిటంటే ఈ ఆధునిక గ్యాడ్జెట్ ఉపయోగకరమే అయినా, జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరానికి, మనసుకు కొన్ని సమస్యలు కలిగే ప్రమాదం ఉందని.
స్మార్ట్‌వాచ్‌ల్లో బ్లూటూత్, వై-ఫై, ఎల్టీఈ వంటి సిగ్నల్స్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాయి. వీటి వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (EMF) రేడియేషన్ వస్తుంది. చాలా తక్కువ స్థాయిలో ఉన్నా, దీన్ని రోజుకు 24 గంటలు శరీరానికి అతి దగ్గరగా ధరించడం వల్ల తలనొప్పి, అలసట, నిద్రలేమి, గుర్తించలేని బలహీనత వంటి సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్ర సమయంలో వాచ్ ధరించడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ స్థాయులు తగ్గి, నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశముంది. అందుకే రాత్రి సమయంలో స్మార్ట్‌వాచ్‌ను తీయడం మంచిదని సలహా ఇస్తున్నారు.
మరోవైపు, స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లపై ప్రభావం చూపడం మాత్రమే కాకుండా, అలర్ట్స్ వల్ల మధ్యలో నిద్ర భంగం కలిగే అవకాశం కూడా ఉంది. కొంతమంది నిద్రను మానిటర్ చేయడానికి వాచ్ తప్పనిసరిగా పెట్టుకుంటారు. అయితే అది కొన్నిసార్లు నిజమైన విశ్రాంతిని కాదని, మానసికంగా ఆందోళనను పెంచుతుందని నిపుణుల అభిప్రాయం. దీని వల్ల “ఆర్తోసోమ్నియా” అనే నిద్రపై భయం కూడా రావచ్చు.
స్మార్ట్‌వాచ్ వాడకంలో శుభ్రత కూడా చాలా ముఖ్యం. ఎక్కువసేపు వాచ్ ధరించడం వల్ల చెమట, ధూళి పేరుకుపోయి చర్మంపై అలర్జీలు, ర్యాష్‌లు, ఎరుపు సమస్యలు రావచ్చు. కొన్ని మోడళ్లలో నికెల్, సిలికాన్ వాడటం వల్ల సున్నితమైన చర్మం కలిగిన వారికి మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే స్ట్రాప్‌ను గట్టిగా కట్టుకుంటే నరాలపై ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ సమస్యలు రావచ్చు. అందుకే వాచ్‌ను కొంచెం లూజ్‌గా పెట్టుకోవడం, రోజూ ఒకసారి శుభ్రం చేయడం అవసరం.
అంతేకాకుండా, స్మార్ట్‌వాచ్ వాడకం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు హార్ట్‌రేట్, నిద్ర వివరాలు, ఫిట్‌నెస్ మెట్రిక్స్ చూసే అలవాటు వల్ల ఆందోళన పెరుగుతుంది. నోటిఫికేషన్లు ఆగకుండా వస్తే మరింత స్ట్రెస్ పెరుగుతుంది. కనుక అవసరంలేని యాప్‌లకు నోటిఫికేషన్లు ఆఫ్ చేసి, అవసరమైన వాటికి మాత్రమే అనుమతించడం మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది.
మొత్తం మీద, స్మార్ట్‌వాచ్ అనేది ఆధునిక జీవనంలో ఉపయోగకరమైన గ్యాడ్జెట్ అయినా, దాని వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే సాంకేతిక సౌకర్యాన్ని అనుభవించాలంటే పరిమిత వినియోగం, శుభ్రత, రాత్రి సమయంలో వాచ్ తీయడం లాంటి అలవాట్లు పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
