Sleeping: రాత్రి 1 గంట వరకు నిద్ర రావట్లేదా.. మీ శరీరంలో ఏం జరుగుతుందంటే..?

రాత్రి పన్నెండు దాటినా ఫోన్ స్క్రీన్‌నే చూస్తూ కూర్చోవడం.. ఒక ఎపిసోడ్ అయిపోయిందంటే ఇంకో షో పెట్టేయడం.. ఇంకో గంటలో పడుకుందాం.. అనుకుంటూ వర్క్ ల్యాప్‌టాప్ మూయకపోవడం.. ఇవన్నీ ఇప్పుడు చాలామందికి నార్మల్ లైఫ్‌స్టైల్ అయిపోయాయి. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యంపై మెల్లగా, లోపల నుంచి తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్‌గా తెల్లవారుజామున 1 గంట దాటాక నిద్రపోవడం శరీర సహజ రికవరీ వ్యవస్థను పూర్తిగా గందరగోళం చేస్తుంది. ఎన్ని గంటలు నిద్రపోతున్నారన్నదికంటే.. ఏ టైమ్‌లో పడుకుంటున్నారన్నదే అసలు కీలకం అని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి ఒక నేచురల్ బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. అదే సర్కేడియన్ రిథమ్. ఈ రిథమ్ ప్రకారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యే శరీరం అత్యంత కీలకమైన హీలింగ్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తుంది. ఈ సమయంలో సెల్ రిపేర్, హార్మోన్ బ్యాలెన్సింగ్, ఫ్యాట్ బర్నింగ్, బ్రెయిన్ రికవరీ లాంటి పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. కానీ ఈ గోల్డెన్ విండోలో మీరు మేల్కొని ఉంటే.. శరీరం చేయాల్సిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయని డాక్టర్ చెబుతున్నారు.

వైద్య నిపుణుల వివరాల ప్రకారం, రాత్రి 9 నుంచి 10 మధ్య శరీరం డీటాక్సిఫికేషన్ ప్రారంభిస్తుంది. 11 గంటల తర్వాత మెలటోనిన్ హార్మోన్ పెరిగి గాఢ నిద్ర మొదలవుతుంది. అర్ధరాత్రి సమయానికి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ విడుదలై కొవ్వును కాల్చే ప్రక్రియ వేగం పెరుగుతుంది. కానీ తెల్లవారుజామున 1 గంట దాటినా మేల్కొని ఉంటే లివర్ డీటాక్స్ నెమ్మదిస్తుంది, టాక్సిన్లు పేరుకుపోవడం మొదలవుతుంది. 3 గంటల తర్వాత నిద్ర లైట్‌గా మారిపోతుంది. అప్పుడు శరీరానికి హీల్ అయ్యే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.

ఈ కీలక దశలను తరచూ కోల్పోవడం వల్ల హార్మోన్ అసమతుల్యత, బరువు నియంత్రణ లోపించడం, బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు క్రమంగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా అధికమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చిన్న మార్పులు చాలంటున్నారు నిపుణులు. రాత్రి 11 గంటల లోపే నిద్రకు వెళ్లేలా శరీరాన్ని అలవాటు చేయడం, సాయంత్రం తర్వాత కాఫీ, టీ వంటి కెఫిన్ డ్రింక్స్ తగ్గించడం, పడుకునే ముందు కనీసం గంట పాటు ఫోన్ లేదా టీవీకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. అలాగే మెగ్నీషియం అధికంగా ఉండే అరటిపండ్లు, గింజలు, పాలకూర, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని సూచిస్తున్నారు. నిద్రను లైట్‌గా తీసుకోవద్దు.. ఎందుకంటే రాత్రి మీరు మేల్కొని గడిపే ప్రతి గంట, మీ శరీరం కోల్పోయే ఒక విలువైన ఆరోగ్య పెట్టుబడిలాంటిదే.