పాపం షర్మిల.! ఈ సింపతీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షకు అనుమతిస్తే, ఏకబిగిన 72 గంటలపాటు దీక్ష చేస్తానని భీష్మించుక్కూర్చున్నారు షర్మిల. దాంతో, పోలీసులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. పోలీసులు, షర్మిల దీక్షను భగ్నం చేసే క్రమంలో తోపులాట జరిగింది. షర్మిల స్పృహ కోల్పోయారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి తరలించి, ఆమె ఇంటికే పోలీసులు చేర్చారు. అయితే, ఇంటివద్ద కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు.
ఇదిలా వుంటే, బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమనీ, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాననీ షర్మిల చెబుతున్నారు. నిరుద్యోగుల సమస్యలపై స్పందిస్తూ షర్మిల ఈ దీక్ష చేపట్టిన విషయం విదితమే. తెలంగాణలో అధికారమే లక్షంగా పార్టీ పెట్టనున్న షర్మిల, అందుకు ఈ దీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజానికి, రాజకీయాల్లో ఇలాంటి దీక్షలు సర్వసాధారణమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అదినేత కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు. చంద్రబాబు కూడా నిరాహార దీక్ష చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీక్ష చేశారు. నాయకులు దీక్షలు చేయడం, వాటిని పోలీసులు భగ్నం చేయడం అన్నది సర్వసాధారణమైన విషయం.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కాదని, తెలంగాణలో పార్టీ పెట్టాలన్న షర్మిల ఆలోచన వెనుక పెద్ద కుట్ర వుందనే విమర్శలు ఆయా రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే, ఓ సోదరుడిగా.. షర్మిలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి సహకారం వుంటుందా.? కనీసం ఓదార్పు అయినా లభిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. షర్మిలకు రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సహకారం వుండదుగానీ, జగన్ – షర్మిల మధ్య అనుబంధం ఇదివరకటిలానే కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. మరి, జగన్.. షర్మిల విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.