వైఎస్ షర్మిల.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె. తెలుగు నాట రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రత్యేకమైన స్థానం. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే, వైఎస్సార్ హయాంలో తెరపైకి తెచ్చిన సరికొత్త సంక్షేమ పథకాలెన్నో కనిపిస్తాయి. అప్పటికీ, ఇప్పటికీ.. ఆ సంక్షేమ పథకాలు కొనసాగుతూనే వున్నాయంటే, ఎంత ముందు చూపుతో వాటిని ఆయన ఆచరణలోకి తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పడు ఆ వైఎస్సార్ అనే బ్రాండ్ ఇమేజ్‌తో తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు షర్మిల. గతంలో ‘జగనన్న వదిలిన బాణం’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల, ఇప్పుడు సొంత కుంపటి పెడతారా.? లేదంటే, అన్న జగన్ ప్రోత్సాహం, మద్దతుతోనే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారా.? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ‘షర్మిలక్క’ అంటూ అప్పుడే తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు, షర్మిలకు బ్రహ్మరథం పట్టే చర్యలు షురూ చేశారు. లోటస్ పాండ్‌లో ఈ రోజు కీలక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం మరికొన్ని రోజులు దఫదఫాలుగా కొనసాగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
అయితే, షర్మిలతో ఏ నాయకులు భేటీ కాబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. సాయంత్రానికే షర్మిల కొత్త రాజకీయ ప్రయాణంపై ఓ స్పష్టత రాబోతోందని అర్థమవుతోంది. షర్మిల పేరుతో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. వైసీపీ శ్రేణుల హంగామా కూడా ‘షర్మిలక్క’ విషయంలో కనిపించకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. అయితే, షర్మిల ఏం చేసినా.. అది జగన్‌కి వ్యతిరేకంగా వుండకపోవచ్చు. ఎందుకంటే, అన్న అడుగుజాడల్లో నడిచే సోదరిగా షర్మిల తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. అన్న జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలన్న పట్టుదలతో ఆమె తెలుగునాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.. కష్టతరమైనప్పటికీ సుదర్ఘమైన పాదయాత్ర చేశారు. అయినాగానీ, ఆమెకు వైసీపీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతోనే, ‘సొంత నిర్ణయం’ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది.