రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయితీ ఎన్నికల నిర్వహణలో విఫలమవుతున్నారట. తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఇది. నిన్న మొన్నటిదాకి ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ప్రశంసల వర్షం కురిపించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడేమో ఆయన పేరు చెబితేనే మండిపడిపోతోంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు పద్ధతిగా జరగలేదంటూ ఏకంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి ఫిర్యాదు చేసేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఇలాంటి జిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా చిన్న చిన్న గలాటాలు జరిగిన మాట వాస్తవం. విపక్షాలు మద్దతిస్తోన్నఅభ్యర్థుల్ని అధికార పార్టీ బెదిరించిన మాట కూడా వాస్తవం.
పంచాయితీ ఎన్నికల్లో ఇలాంటివన్నీ మామూలే. స్థానిక పరిస్థితుల్ని బట్టి అలాంటివన్నీ జరుగుతుంటాయి. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను లాగేసిన ఘనత చంద్రబాబుది. అలా వచ్చినవారికి తన హయాంలో మంత్రి పదవులూ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడిలా రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయం లేని పంచాయితీ ఎన్నికల విషయంలో అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం శోచనీయమే. మేమే మెజార్టీ స్థానాలు గెలిచామని వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదం. ఎందుకంటే, అది సాధారణమైన విషయం.. అయినాగానీ, వైసీపీ గుర్తు మీద ఎవరూ గెలవలేదు గనుక.. అలా వైసీపీ ప్రకటించుకోకూడదు. మరి, టీడీపీ చేస్తున్నదేంటి.? టీడీపీ కూడా సంబరాలు చేసేసుకుంది. మేం బాగా పుంజుకున్నాం.. సత్తా చాటాం.. అని టీడీపీ చెప్పుకుంది. ఇంతలా చెప్పుకుని, అసలు పంచాయితీ ఎన్నికలు సజావుగా జరగడంలేదని అంటే ఎలా.? ఇదే విషయమై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే ఎలా.? ఇందుకే చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అనేది. ఎవరేమనుకున్నా, చంద్రబాబు మాత్రం మారరుగాక మారరు. మారితే అసలాయన చంద్రబాబే కాదు. టీడీపీ తాజా తీరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అవాక్కయి వుండొచ్చు. ఎందుకంటే, ఇలాంటి రివర్స్ గేర్‌లను బహుశా నిమ్మగడ్డ ఎప్పుడూ చూసి వుండరేమో.