పాపం రేవంత్ రెడ్డి.. ఇంకెన్నాళ్ళీ ఆరాటం.?

Revanth Reddy will also consider the TRS

రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం కొత్తగా అవసరం లేనంత పాపులారిటీ వున్న రాజకీయ ప్రముఖుడాయన. తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగినా, తెలంగాణలో టీడీపీని చంద్రబాబు లైట్ తీసుకోవడంతో, వేరే దారి లేక కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ అగ్రెసివ్ పొలిటీషియన్. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినా, లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, రాజకీయంగా నిలదొక్కుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలోనే వున్నారు. కానీ, ఏం లాభం.? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఐసీయూలోని పేషెంట్‌లా తయారైంది. కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అందివ్వడం కుదరని పని. అయినాగానీ, రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని వేలాడుతూనే వున్నారు. బీజేపీలోకి వెళ్ళే అవకాశం వున్నా, ఎందుకో ఆయన ఆ రిస్క్ తీసుకోలేకపోతున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలో తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నారు రేవంత్ రెడ్డి. అంటే, తనకు సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దింపి, మొత్తం పార్టీ వ్యవహారాలు చూసుకుని.. పార్టీని గెలిపించడం అన్నమాట. అది కుదిరే పనే కాదు. గ్రేటర్ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి ఆ అవకాశం దక్కలేదు.

Revanth Reddy will also consider the TRS
Revanth Reddy will also consider the TRS

తెలంగాణ పీసీసీ పగ్గాల కోసం రేవంత్ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినా, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు షాకుల మీద షాకులు ఇస్తూనే వుంది. ఇంకా ఎక్కువకాలం ఇలాగే కాంగ్రెస్ రాజకీయాలకు బలైపోతూ వుంటే, భవిష్యత్ చాలా చాలా భయానకం.. అన్న చర్చ రేవంత్ అభిమానుల్లో జరుగుతోంది. అయినాగానీ, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. అన్న పిలుపు కోసం రేవంత్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. రేవంత్ తరహాలోనే ఓ పాతిక మంది ఆ పదవికి పోటీ పడుతున్న దరిమిలా, రేవంత్ అంత సులువుగా ఆ పదవిని పొందే అవకాశమే లేదు. నిజానికి రేవంత్ గనుక పార్టీ మారాలనుకుంటే బీజేపీ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అందుబాటులోనే వుంది. రాజకీయాల్లో విలువలు, వంకాయలూ ఏమీ వుండవ్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని రేవంత్ కంటే గట్టిగా విమర్శించిన ఎందరో నేతలు గులాబీ పార్టీలో చేరిపోయారు. ఏమో, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దూకేసిన రేవంత్, కాంగ్రెస్ నుంచి ఏదో ఒక పార్టీలోకి దూకే క్రమంలో గులాబీ పార్టీని కూడా కన్సిడర్ చేస్తారేమో వేచి చూడాల్సిందే.