కేసీయార్ అనారోగ్యంపై ‘మెరుపు వేగం’తో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.!

ఔను, మెరుపు వేగంతోనే స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యం విషయంలో.! ఓ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత విషయంలో ఇదిగో, ఇలాగే స్పందించాలి. అదే పద్ధతి కూడా.!

రాజకీయాలన్నాక విమర్శలు. ప్రతి విమర్శలు మామూలే. రాజకీయంగా విమర్శలు చేసుకోవడం తప్పు కాదు. రాజకీయ ప్రత్యర్థులుగా మారాల్సి రావడమూ తప్పు కాదు. కానీ, రాజకీయాల్లో వున్నంత మాత్రాన వ్యక్తుల మధ్య శతృత్వం వుండకూడదు.

కొన్నేళ్ళ క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగింది. ఆ ఘటనపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్ని వెటకారాలు చేశారో చూశాం.

‘ఆయనే పొడిపించుకున్నారు..’ అంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఆయన హయాంలో పని చేసిన డీజీపీ.. అభ్యంతర వ్యాఖ్యలే చేశారు. అప్పటి హోం మంత్రిదీ అదే తీరు.!

అందుకే, అనారోగ్య సమస్యలతో బెయిల్ కోసం చంద్రబాబు (స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో) ప్రయత్నించినప్పుడు, చంద్రబాబు మీద వైసీపీ తీవ్రమైన వెటకారాలే చేసింది. ఇప్పటికీ చేస్తూనే వుంది. అప్పట్లో చంద్రబాబు చేసింది తప్పే, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నదీ తప్పే.!

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. బాత్రూమ్‌లో జారిపడిన కేసీయార్‌కి శస్త్ర చికిత్స జరగనుంది. తుంటి ఎముకకు గాయం కావడంతో, ఫ్రాక్చర్స్ అయ్యాయట. వాటికి మేజర్ సర్జరీ చేయనున్నట్లు యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

వైద్యానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తగిన ఆదేశాలూ జారీ చేశారు. ఉన్నతాధికారుల బృందం కేసీయార్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తోంది.