తెలంగాణలో రోజు రోజుకీ రాజకీయంగా కాకరేపుతున్న టీఎస్పీఎస్సీ వ్యవహరంపై ఈడీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ బృందం. ఇప్పటికే ఈ వ్యవహరంపై తెలంగాణ సర్కార్ “సిట్” దర్యాప్తుకు ఆదేశించినా.. ఆ సిట్ దర్యాప్తు మొత్తం కేటీఆర్ కనుసన్నల్లోనూ, అదుపాజ్ఞల్లోనే జరుగుతుందని… ఫలితంగా అసలు దొంగలు తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ పై ఫైరవుతూనే.. సెటైర్లు వేశారు!
పరీక్ష పత్రాలను అమ్ముకుంటుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది.. ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్తూపం వద్ద ఉరి తీసినా తప్పులేదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2వేల మంది విద్యార్థులు మరణించారు.. విద్యార్థులు చనిపోతున్నా కూడా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లైనా లేదు.. పైగా ఆధారాలు బయట పెడితే తిరిగి మామీదే కేసులు పెడుతున్నారు.. అంటూ కేసీఆర్ & కో పై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి ఫిర్యాదు చేసిన సందర్భంగా రేవంత్ ఈ రేంజ్ లో ఫైరయ్యారు.
ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని మొదటినుంచీ బలంగా చెబుతున్న రేవంత్ రెడ్డి… ఆ విషయాన్ని కప్పి పెట్టడానికే పెద్దలు “సిట్” ను నియమించారని విమర్శించారు. ఇందులో భాగంగానే… కావల్సిన పెద్దలను కాపాడటానికి.. దిగువ స్థాయి ఉద్యోగులను బలి పశువులు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయని, ఇందులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారిందని రేవంత్ ఆరోపించారు.
అనంతరం కేటీఆర్… తనపై వేసిన వందకోట్ల పరువునష్టంపై సెటైరికల్ గా స్పందించారు రేవంత్ రెడ్డి. ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో సీబీఐ పై నమ్మకం లేకపోతే, కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే… సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించాలని కేటీఆర్ ని కోరిన రేవంత్… అలా చేస్తే తమకుపరువుందని ఒప్పుకుంటామని తెలిపారు! అలా చేసిన అనంతరం… కేటీఆర్ కున్న పరువెంత, దాని రేటెంత, అది ఎవరు చెల్లించాలి అన్నది చర్చిద్దామని తెలిపారు.
ఇదే సమయంలో…”100 కోట్ల పరువు నష్టం అంటున్నారు… అంటే 100 కోట్లు ఇచ్చి కేటీఆర్ ను అమ్మనా బూతులూ తిట్టొచ్చా…? ఇదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా కు సైన్ చేసినట్లా.. లేక, సమంత వెబ్ సిరీస్ కు సంతకం చేసినట్లా.. ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి” అంటూ సెటైర్స్ వేశారు రేవంత్! దీంతో కేటీఆర్ విషయంలో మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకొచ్చారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు! మీ రాజకీయాల మధ్యలోకి పాపం రకుల్ ని ఎందుకు లాగుతారంటూ మరోపక్క ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.