ఎమ్మెల్యే పెట్టిన చిచ్చు, 8 మంది ఎంపీటీసీల రాజీనామా

మినిస్టర్ క్వార్టర్స్ వద్ద రాజీనామా లేఖతో ఎంపీటీసీలు 

నల్లగొండ జిల్లా వేములపల్లి మండల ఎంపీటీసీలు ఎనిమిది మంది రాజీనామాకు సిద్దమయ్యారు. మంగళవారం రాత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డిని కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. మండలంలోని 13 మంది ఎంపీటీసీలకు గాను 8 మంది రాజీనామా లేఖలను సమర్పించారు. అఃసమ్మతిగా ఉన్న 10 మంది ఎంపీటీసీలు గత నెల 6 వతేదిన ఎంపీపీ నామిరెడ్డి రవీనా కరుణాకర్ రెడ్డిపై అవిశ్వాసాన్ని పెడుతూ జెసీ, ఆర్డీవోకి నోటీసును అందజేశారు. ఆగష్టు 2న అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు ఇద్దరు ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి తనవైపు తిప్పుకున్నాడు. తమ క్యాంపు నుంచి ఇద్దరు ఎంపీటీసీలు తప్పుకున విషయం తెలుసుకున్న 8మంది ఎంపీటీసీలు మనస్తాపంతో రాజీనామాకు సిద్దమయ్యారు. మంత్రిని కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు. నేడు ఎంపీడీవోకి, కలెక్టర్ కు తమ రాజీనామా లేఖలను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

        

  ఎంపీటీసీలు మంత్రి జగదీశ్ రెడ్డికి సమర్పించిన రాజీనామా లేఖ

మొత్తానికి వేములపల్లి మండలంలో అధికార టిఆర్ ఎస్ ఎంపీటీసీల మధ్య విభేధాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అధిక మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి సిద్దంగా ఉన్నా కూడా ఎమ్మెల్యే చేసిన రాజకీయం సరికాదని ఎంపీటీసీలు ఆగ్రహంగా ఉన్నారు. రాజీనామా చేసిన వారిలో వైస్ ఎంపీపీ ఎల్లారెడ్డి, అర్జున్, శ్రీరాంరెడ్డి, పుష్పలత, యశోద, పద్మ, అరుణమ్మ, కోల అరుణ ఉన్నారు. దీనిపై అధికారులు, మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంపీటీసీలను కాంప్రమైజ్ చేసేందుకు ఇప్పటికే నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.