తెలంగాణలోనూ పోటీ.! పవన్ కామెడీ చెయ్యట్లేదు కదా.?

Pawan Kalyan : ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు హైద్రాబాద్ నుంచి.. ఆయన పర్యటన జరిగిన నల్గొండ వరకూ హంగామా సృష్టించారు. హై ఓల్టేజ్ ఎలివేషన్ సీన్స్.. అన్నట్లే కనిపించింది వాతావరణం. ఔను, పవన్ కళ్యాణ్‌కి బోల్డంతమంది అభిమానులున్నారు. కానీ, ఏం లాభం.? వాళ్ళలో ఎంతమంది జనసేనకు ఓట్లు వేస్తారో జనసేనానికే తెలియని పరిస్థితి.

‘ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకు కనీసం 5 వేల నుంచి 6 వేల వరకూ ఓట్లున్నాయి.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మూడొంతుల స్థానాల్లో పోటీ చేస్తాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

2019 ఎన్నికల్లో కూడా జనసేన, తెలంగాణలో పోటీ చేసింది. తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఏపీలో ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన జనసేనాని, అక్కడి నుంచే రెండు చోట్ల పోటీ చేశారుగానీ, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బీజేపీకి జనసేన మిత్రపక్షం. కానీ, రెండు పార్టీలూ తెలంగాణలో కలిసి పని చేయడంలేదు. తెలంగాణ రాష్ట్ర సమితికి పరోక్షంగా జనసేన మద్దతిస్తోంది. అది తెలంగాణ బీజేపీ నేతలకు ఒళ్ళు మండేలా చేస్తోంది. నియోజకవర్గానికి 5 నుంచి 6 వేల ఓట్లు జనసేనకున్నాయ్.. అని పవన్ కళ్యాణ్ చెప్పడంలో పెద్ద అర్థమే వుంది. ఆ ఓట్లు కీలకం గనుక, ఏ పార్టీ అయినా తమతో సంప్రదింపులకు రావొచ్చని జనసేనాని ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లుంది పరిస్థితి.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి జనసేన మద్దతిచ్చి, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ఒకటి రెండు సీట్లన్నా తీసుకుని, గెలిస్తే.. జనసేనకూ రాజకీయంగా ప్రయోజనమే. కానీ, అది జరిగే పనేనా.? పవన్ తెలంగాణలో తమ పార్టీ పోటీ చేస్తుందంటూ కామెడీగానీ చెయ్యట్లేదు కదా.?