అమరావతి నుంచి రాజధాని జంప్ ప్రభావమా?
ఓవైపు కరోనా విలయం నగరాల్ని అట్టుడికిస్తోంది. హైదరాబాద్ సహా అన్ని మెట్రోల్లో మహమ్మారీ పాజిటివ్ కేసులతో అల్లకల్లోలంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ – కరీంనగర్- వరంగల్- వైజాగ్ – గుంటూరు- నెల్లూరు- తిరుపతి అన్ని చోట్లా కోవిడ్ విలయం కొనసాగుతోంది. ఈ పర్యవసానం అన్ని రంగాలపైనా పడింది. ఏవీ కొనుగోళ్లు అమ్మకాలు సాగడం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పైనా దీని ప్రభావం అసాధారణంగా ఉందని తెలుస్తోంది.
కోవిడ్ కి ముందు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఓ రేంజులో వెలిగింది. అడ్వాన్స్ బుకింగులతో ఎదురు చూసిన కస్టమర్ ఉండేవాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వెంచర్ల పేరుతో లక్షల కోట్ల వ్యాపారం సాగుతోంది. అలాగే యాదాద్రి నరసింహ స్వామి ఆలయం పేరుతో ఆ చుట్టుపక్కలా పరుగులు పెట్టించారు. నిత్యం రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ ల ఫోన్లు రింగుమనేవి. కేసీఆర్ – కేటీఆర్ అంతటి వారే స్వయంగా రియల్ బూమ్ పై హర్షం వ్యక్తం చేశారు. స్టేట్ డివైడ్ .. నోట్ల రద్దు.. జీఎస్టీ వంటి అంశాలు రియల్ ఎస్టేట్ ని దారుణంగా దెబ్బ కొట్టాయి. ఆ మూడు సందర్భాల్లో రియల్ రంగం ఢమాల్ మంది.
ఇటీవల పుంజుకున్నట్టే పుంజుకుని మళ్లీ మరోసారి సీన్ సీన్ అంతా రివర్సయ్యింది. ఇదంతా కోవిడ్ దెబ్బ. ఈ త్రైమాసికానికి హైదరాబాద్ లో కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. 50-60 శాతం మేర కొనుగోళ్లు పడిపోయాయి. 30 శాతం కొనుగోళ్లు సాగినా సంతోషమే అనుకునే పరిస్థితి దాపురించిందట. గత ఏడాదితో పోలిస్తే అంత దారుణంగా ఉంది సీను.
రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోలుకునే ఛాన్సే లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవంతులు కూలీల్లేక పూర్తవ్వడం లేదు. పైగా భవంతులు వెంచర్లు పూర్తయినా ఈఎంఐలు కట్టే నాథుడే కనిపించడం లేదు. ఇప్పటికే ఉన్న ఈఎంఐలు మారటోరియంలో పెట్టుకుని లబోదిబోమంటున్న మధ్యతరగతి సహా చోటా మోటా ఉద్యోగులు అయితే ఇక సొంతింటి కలనే మర్చిపోయారు. హైదరాబాద్ సహా నగరాల్లో అసలు ఇంటి నిర్మాణానికి కూలీలే దొరకని పరిస్థితి ఉంది. కరోనాకి భయపడి అంతా పల్లెలకు వెళ్లిపోయి తిరిగి రావడం లేదని చెబుతున్నారు.
హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన నగరంలో పరిస్థితి ఇలా ఉంటే.. అటు వైజాగ్ లో రియల్ బూమ్ ఒక్కసారిగా లేచిందని హడావుడి జరిగిపోతోంది. అయితే అలాంటి ప్రచారానికి ఎందుకు తెరలేపారు అంటే.. ఉన్నట్టుండి అమరావతి నుంచి పాలనా రాజధాని విశాఖకు జంప్ అవుతుండడమే. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకుని రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారు. నిజానికి గత ఆరేడు నెలలుగా వైజాగ్ రియల్ రంగం ఎంతగానో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. అక్కడ రియల్ బాబులు కంటికి కునుకు లేకుండా రియల్ రంగంపై కలలు గంటున్నారు. విశాఖ రాజధాని వస్తే ఒక్కసారిగా ధరలు పెంచేసి అమ్మాలని కలలు గన్నారు. అయితే ఆ కలల్ని ఇప్పుడు నెరవేర్చుకోవాలని చూస్తున్నా.. కోవిడ్ మహమ్మారీ ఆ పప్పులు ఉడకనివ్వడం లేదు. రాజధాని ఊపు ఉన్నా కానీ జనం దగ్గర సొమ్ములేవీ? అన్నదే అసలు పాయింట్. తినడానికి తిండి లేక .. ఉండడానికి అద్దె గూడు అయినా లేక జనం రోడ్ల పాలైతే ఇక రియల్ రంగం లేస్తుందా? అన్న ప్రశ్న తలెత్తింది.
అయితే ఇప్పుడున్న పరిస్థితి తిరిగి యథాస్థితికి రావాలంటే ముందు కోవిడ్ కి వ్యాక్సిన్ రావాలి. వ్యాక్సిన్ లేదా టీకా భరోసా ఉండాలి. కేసులన్నీ జీరో స్థాయికి పడిపోవాలి. అప్పుడు తిరిగి యథావిధిగా కోల్పోయిన ఉద్యోగాలు వెనక్కి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది ఉద్యోగాలు పోయి రోడ్లెక్కారు. కార్మికులకు తిండి తిప్పలేని పరిస్థితి. ఇలాంటప్పుడు రియల్ వెంచర్ల వ్యాపారం పరిగెట్టిస్తామంటే ఆమోద యోగ్యం కానే కాదనేది నివేదన.
విశాఖ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నా.. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోవడంతో అది ఏమేరకు సాధ్యం అన్నది ఆలోచించాల్సిన విషయమే. మరోవైపు జగన్ 3లక్షల కోట్లు అప్పు చేసి కొత్త రాజధానిని అభివృద్ధి చేస్తారన్న ప్రచారం ఊక దంచేస్తున్నారు. ఇక జగన్ కొట్టిన దెబ్బకు అమరావతి రియల్ బూమ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. అక్కడ బినామీల పేరుతో భూములు కొన్నవాళ్లంతా మెంటలెక్కి ఆస్పత్రుల పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోందని ఇన్ సైడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులు.. వారి అనుయాయులు.. పత్రికల వాళ్లు, పారిశ్రామిక వేత్తలు, ఒక సామాజిక వర్గం ఎన్నారైలు ఇక్కడ భారీగా భూములు కొని ఇప్పుడు తగలబడిపోయారన్నది ఒక నివేదన.
-శివాజీ.కె