YCP :ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చిన కొత్త ‘పన్ను’ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రైవేటు వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ సంస్థలు తమ వెంచర్లలోని 5 శాతం భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సి వుంటుంది.. లేదా, ఆ ఐదు శాతం భూమికి వెలకట్టి, దాన్ని ప్రభుత్వానికి అందించాల్సి వుంటుంది.
ఒకవేళ వెంచర్‌లో స్థలం ఇవ్వలేకపోయినా, డబ్బు ఇచ్చే ఉద్దేశ్యం లేకపోయినా, వెంచర్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సంబంధిత భూమిని అందించే వెసులుబాటు రియల్ ఎస్టేట్ సంస్థలకు కల్పించింది వైఎస్ జగన్ సర్కార్. దీన్ని ‘గవర్నమెంట్ సెటిల్మెంట్ పన్ను’ అంటూ కొందరు వెటకారం చేస్తున్నారు.
అసలు ఇలాంటి నిర్ణయాల్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుంటోంది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై సంతృప్తిగా లేరు. రాష్ట్రంలో గడచిన రెండున్నరేళ్ళలో రియల్ రంగం పూర్తిగా పడకేసిన మాట వాస్తవం.
మార్కెట్‌లో అధికారిక వ్యవహారాల సంగతి పక్కన పెడితే, అనధికారికంగా భూముల విలువ పెరగడంలేదు. దాంతో, రియల్ వ్యాపారం చాలా డల్లుగా సాగుతోంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ‘5 శాతం’ అంటూ షాకిచ్చింది ప్రభుత్వం. నిజానికి, రియల్ వ్యాపారులకే కాదు, నివాస స్థలం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకీ ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే.
‘అబ్బే, ఇది పాత నిబంధనే..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చినాసరే, ఈ ఐదు శాతం వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి కాబోతోందన్నది నిర్వివాదాంశం. ఐదు శాతం వాటా కింద ప్రభుత్వానికి వచ్చే భూమిని లేదా సొమ్ముని పేద ప్రజల కోసమే ఖర్చపెడతారట. ఉద్దేశ్యం మంచిదే అయినా, 5 శాతం రియల్ పన్ను మాత్రం అస్సలేమాత్రం సమర్థనీయం కాదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. వైసీపీకి 100 శాతం రాజకీయంగా డ్యామేజ్ చేస్తుందీ 5 శాతం నిర్ణయం.. అన్నది మెజార్టీ అభిప్రాయం.