ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై అధికార కూటమి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే పులివెందులలో ఉపఎన్నికలు తప్పవని హెచ్చరించారు. ఈ హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
గతంలో కూడా జగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు వేస్తానని రఘురామ హెచ్చరించగా, అప్పుడు ఆయన హాజరయ్యారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆయన గైర్హాజరు కొనసాగింది. దీంతో ఇప్పుడు రఘురామ హెచ్చరికలకు ప్రాధాన్యత పెరిగింది.
రఘురామ హెచ్చరికలకు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే ఉపఎన్నికలు వస్తాయన్న రఘురామ వ్యాఖ్యలపై ఆయన “అదీ చూద్దాం” అంటూ సవాల్ విసిరారు.
Deputy Speaker Warns Jagan: ”అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే” జగన్‌కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అంబటి రాంబాబు గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. “చంద్రబాబు అసెంబ్లీ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయినప్పుడు కుప్పంలో ఉపఎన్నికలు వచ్చాయా?” అని ప్రశ్నించారు. అలాగే, “ఎన్టీఆర్ రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పినప్పుడు ఉపఎన్నికలు పెట్టారా?” అని అడిగారు. అప్పుడు జరగనిది ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అధికార కూటమి అంత సమర్ధులేనా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
ఉపఎన్నికలు వస్తే కోయ ప్రవీణ్ సహాయంతో గెలవాలని అధికార కూటమి చూస్తోందని అంబటి ఆరోపించారు. గతంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో కోయ ప్రవీణ్ సహాయంతోనే అధికార కూటమి గెలిచిందని, అది సాంకేతిక విజయమే కానీ నైతిక ఓటమి అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఏదైనా చేస్తే, అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తారని హెచ్చరించారు.
జగన్ గైర్హాజరుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి.


