పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ ఒత్తిడి.! ఎటువైపునుంచి.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చాలా తీవ్రంగా వుందట. ‘అన్ని విషయాల్నీ పరిగణనలోకి తీసుకుని, రెండు మూడు రోజుల్లోనే పూర్తి స్పష్టత ఇస్తాం..’ అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరి నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు.? ప్రస్తుతానికి జనసేన, బీజేపీ మధ్యన పొత్తు వుంది. అయితే, ఆ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే పరిమితం. తెలంగాణలో బీజేపీ – జనసేన ఒకదానితో ఒకటి అంటీ ముట్టనట్టే వ్యవహరిస్తున్నాయి.

అలాగని, జనసేన అవసరం బీజేపీకి లేదా.? అంటే, వుంది.! కాకపోతే, రెండు పార్టీల మధ్యా గ్యాప్ వుంది.! తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అంటే పవన్ కళ్యాణ్‌కి వల్లమాలిన అభిమానం. తెలంగాణ మంత్రి కేటీయార్ ఏకంగా సోదర సమానుడు పవన్ కళ్యాణ్‌కి.! టీడీపీతోనూ పొత్తుకి ‘సై’ అనేసింది జనసేన ఇటీవల.!

దాదాపు 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జనసేన పార్టీ విభాగం ఇప్పటికే ప్రకటించేసింది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం, ‘తీవ్రమైన ఒత్తిడి వుంది.. త్వరలోనే చెప్తా..’ అని అంటున్నారేంటి.?

అంటే, బీజేపీ – టీడీపీ విషయమై జనసేనాని ఇంకా స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారా.? ఈలోగా ఎన్నికలు కూడా పూర్తయిపోతాయా.? అంతేనేమో, నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం.. ఇలాగే వుంటుంది మరి.! కానీ, ఇది వ్యూహాత్మక అలసత్వం అనుకోవచ్చు.

టీడీపీ నుంచి కాదుగానీ, బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ ఏదో ఆశిస్తున్నారు. అదే సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో సాన్నిహిత్యం నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచీ పవన్ కళ్యాణ్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నట్లే కనిపిస్తోంది. అదే అసలు ఒత్తిడి.