తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. అంతా, షర్మిల కొత్త పార్టీ ప్రచారం నేపథ్యంలోనే కావడం గమనార్హం. నిన్న మొన్నటిదాకా కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) భజనలో మునిగి తేలిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ఒక్కసారిగా స్వరం మార్చి.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద అమితమైన ప్రేమ ప్రదర్శిస్తున్నారు. కేటీఆర్‌ని అభిమానించేవారు, కేసీఆర్ మీద మరింత ప్రేమతో వుంటారన్నది అందరికీ తెలిసిన సంగతే. కానీ, కేటీఆర్ గనుక ముఖ్యమంత్రి అయితే తమకు పదవులు దక్కుతాయన్న కోణంలో కొందరు టీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అలాంటివారి అత్యుత్సాహంపై నీళ్ళు చల్లారు కేసీఆర్. తెలంగాణకు మరికొన్నేళ్ళు తానే ముఖ్యమంత్రిగా వుంటానని స్పష్టం చేస్తూ, కేటీఆర్ పేరుతో యాగీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదంతా జరగడానికి కారణం షర్మిల పార్టీ.. అనే ప్రచారం గట్టిగా సాగుతోంది. షర్మిల గనుక కొత్త పార్టీ పెడితే, అన్ని రాజకీయ పార్టీలకూ ఎంతో కొంత దెబ్బ తగిలినట్లే టీఆర్ఎస్‌కి కూడా తగులుతుంది. కానీ, తెలంగాణలో బీజేపీ బలపడుతున్నవేళ, ఏ చిన్న దెబ్బనీ తట్టుకునేలా లేదు టీఆర్ఎస్.
అందుకే, షర్మిల పార్టీ వ్యవహారాలపై ఓ కన్నేసి వుంచాలంటూ పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారట. తెలంగాణ సెంటిమెంట్‌ని ఎక్కడికక్కడ మళ్ళీ రగల్చాల్సిందేననీ, ఆంధ్రా పార్టీ.. అన్న ముద్ర షర్మిల మీద వేసెయ్యాలనీ, తెలంగాణ సెగ రాజేస్తే.. బీజేపీ కూడా ఆ సెగ దెబ్బకి ఔట్ అయిపోతుందని గులాబీ బాస్, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య వివాదాస్పదంగా వున్న పలు అంశాలు ఇకపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశాలుగా మారేలా, గులాబీ నేతలు ఆయా అంశాలపై గళం విప్పనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఆంధ్రపదేశ్‌లో సహకరించామనీ, కానీ ఇప్పుడు అదే వైసీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి మీద, తెలంగాణ మీద షర్మిలను బలవంతంగా రుద్దుతోందనీ గులాబీ బాస్ గుస్సా అవుతున్నారట. ఇదంతా నిజమేనా.? గిట్టనివారు చేస్తోన్న దుష్ప్రచారమా.? ఏదైతేనేం, షర్మిల.. అంచనాలకు మించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారన్నమాట.