ప్రధాని మోడీ విద్యార్హత చూపించమంటే జరీమానా విధిస్తారా.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హత విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ‘బీకామ్ – పిజిక్స్’ చదివినోళ్ళూ వున్నారు. అలా వుంటుంది రాజకీయ వ్యవస్థ. ‘నేను ఫస్ట్ క్లాస్..’ అని పదో తరగతి పేపర్లు కొట్టేసినోడూ తలెగరేసి తిరుగుతాడు. అదే రాజకీయమంటే.! ముఖ్యమంత్రి అవడానికో, ప్రధాని అవడానికో విద్యార్హతతో సంబంధం లేదు. వైద్యం తెలియని వ్యక్తి కూడా వైద్య శాఖ మంత్రి అయిపోతాడు. ప్రాజెక్టులకు సంబంధించి కనీసపాటి అవగాహన లేని వ్యక్తులు జల వనరుల శాఖ మంత్రులయిపోవడం చూస్తుంటాం.

పైగా, మేమే రాష్ట్రాన్ని ఉద్ధరించేశాం.. మేమే దేశాన్ని ఉద్ధరించేశాం.. అని చెప్పుకుంటుంటారు. అందుకేనేమో, ఉన్నత చదువులు చదివి.. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే మేధావి వర్గం, రాజకీయ నాయకులు కార్లలో వెళుతోంటే, వారి వెనకాల పరుగులు పెట్టాల్సిన దుస్థితి వస్తోంది. ‘నువ్వు ఎవడికి సెల్యూట్ చేస్తున్నావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో..’ అని పోలీస్ వ్యవస్థని సాధారణ ప్రజానీకం ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది.

నేరమయ రాజీకయాల్లో ఆరితేరినవారికి సైతం, ఐపీఎస్ చదివినవారు సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వుంది మరి.! ప్రధాని విద్యార్హత విషయానికొస్తే.! నేషన్ వాంట్స్ టూ నో.! ఔను, ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ చదివారు.? ఆయన విద్యార్హత ఏంటి.? అనేవి దేశం తెలుసుకోవాలనుకుంటోంది. ఇందులో తప్పేముంది.? అలా ప్రశ్నించినందుకు ఓ ముఖ్యమంత్రికి న్యాయస్థానం జరీమానా విధించడమేంటో.!