నెల్లూరు జిల్లాకి చెందిన సీనియర్ పొలిటీషియన్ ఆయన. ‘కుటుంబం’ పరంగానూ బోల్డంత ఇమేజ్ వుంది. అయితే, నిలకడలేమి కారణంగానే ఇటీవలి కాలంలో రాజకీయంగా తన ఉనికిని చాటుకోలేకపోతున్నారాయన. పరిచయం అక్కర్లేని పేరది. నిజానికి, ఇద్దరు అన్నదమ్ములు.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేశారు. ఒకరేమో సౌమ్యుడు.. ఇంకొరేమో ‘సీమ’టపాకాయ్. అనారోగ్యంతో కొన్నాళ్ళ క్రితం ఆ ‘సీమ’ టపాకాయ్ కన్నుమూసింది. దాంతో, రెండు పాత్రలూ ఈ ‘పెద్దా’రెడ్డిగారే పోషించాల్సి వస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటుగా ఈ పెద్దారెడ్డిగారూ వైసీపీకి కొరకరాని కొయ్యిలా తయారవుతున్నట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయిగానీ.. ఆ తర్వాత ‘బుజ్జగింపుల పర్వం’తో సరిపెట్టుకున్నారు. మళ్ళీ రాజకీయంగా ఈ ‘పెద్దా’రెడ్డిగారి అలజడి షురూ అవుతోంది.
నెల్లూరు జిల్లాలో తమ కుటుంబ ఉనికిని చాటుకోవాల్సిన సమయం మళ్ళీ ఆసన్నమయ్యిందనీ, ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో తమ సత్తా చాటుతామనీ ‘పెద్దా’రెడ్డిగారు కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కాస్తా, పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయట. ‘ఏంటి కథ.?’ అంటూ అధిష్టానం ఆరా తీస్తే, వివరణ ఇచ్చేందుకు సదరు రెడ్డిగారు సుముఖత వ్యక్తం చేయలేదట. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు ఈ రెడ్డిగారు వైసీపీకి పెద్ద షాకే ఇవ్వబోతున్నారనీ, ఆయన బీజేపీ వైపు వెళతారనీ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ.. ఇలా ఆయన చాలా పార్టీల్నే చక్కబెట్టేశారు.
ఇప్పుడిక, బీజేపీ వైపుకు కూడా వెళ్తే.. మొత్తంగా అన్ని పార్టీల్నీ చుట్టేసినట్లవుతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఈయనగారికి నెల్లూరులో మంచి పేరే వుంది.. అనుచరగణం కూడా గట్టిగానే వున్నారు. జిల్లాలో ఈయనగారి ఇమేజ్‌ని తొక్కేయడానికి వైసీపీలో ఇంకో వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. మంత్రి పదవి తనకు రాకుండా పోవడానికి ఆ వర్గమే కారణమన్నది ‘పెద్దా’రెడ్డిగారి ఆవేదన. ఎవరా పెద్దారెడ్డిగారు.? ఏమా కథ.? కొద్ది రోజుల్లోనే పూర్తి క్లారిటీ వచ్చేయబోతోందట.