తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇటీవల కొత్త పార్టీని స్థాపించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిర్ణయాన్ని స్వాగతించారు. రాజకీయాల్లో కొత్త పార్టీలు రావడం మంచి పరిణామమని, మల్లన్న కొత్త పార్టీ నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో మహేశ్ గౌడ్ వివరించారు. “కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తీన్మార్ మల్లన్న వ్యతిరేకించారు. అందుకే, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు” అని తెలిపారు. అయినప్పటికీ, వెనుకబడిన వర్గాల (బీసీ) హక్కుల కోసం పోరాడే నాయకుడిగా మల్లన్నను తాను గౌరవిస్తానని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
MLA Maddipati Venkat Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీకి ప్రజలు గుర్తొస్తారు: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు
Telangana Rajyadhikara Party: టీఆర్పీ పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న: జెండాను ఆవిష్కరించిన చింతపండు నవీన్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పాత్ర లేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. “కవితకు చరిత్రపై అవగాహన లేదు. అసలు ఆమె ఎప్పుడు పుట్టారు? ఆమెకు చరిత్ర తెలుసా?” అంటూ సూటిగా ప్రశ్నించారు. చారిత్రక వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా మహేశ్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, కోమటిరెడ్డి సోదరులు కూడా అదే చేస్తారని అన్నారు. అయితే, ఈ స్వేచ్ఛను అలుసుగా తీసుకుని ఎవరైనా ‘రెడ్ లైన్’ దాటితే మాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని ఆయన తేల్చిచెప్పారు.


