Telangana Rajyadhikara Party: టీఆర్‌పీ పార్టీని స్థాపించిన తీన్మార్‌ మల్లన్న: జెండాను ఆవిష్కరించిన చింతపండు నవీన్‌

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్‌పీ) పేరుతో కొత్త పార్టీని స్థాపించినట్లు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా తీన్మార్‌ మల్లన్న ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో ఈ జెండాను రూపొందించారు. ఎరుపు రంగు ప్రజల పోరాటాలను, ఆకుపచ్చ రంగు తెలంగాణ సంపదను సూచిస్తుందని ఆయన వివరించారు. పార్టీ జెండా మధ్యలో బంగారు రంగులో మూడు పువ్వులు కలిగిన ఒక వృత్తం ఉంది, ఇది ప్రజాస్వామ్యం, ప్రగతి, ప్రజల శక్తిని సూచిస్తుంది.

పార్టీ స్థాపనతో పాటు, కీలకమైన రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయనే బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ కార్యకలాపాలను ముందుకు నడిపించేందుకు, ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను, నలుగురు ప్రధాన కార్యదర్శులను నియమించారు.

వ్యవస్థాపక అధ్యక్షుడు: తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌)

వర్కింగ్ ప్రెసిడెంట్లు: మాదం రజినీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్

ప్రధాన కార్యదర్శులు: వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్‌

పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని, మిగిలిన విభాగాలకు సంబంధించిన కార్యవర్గాలను త్వరలోనే ప్రకటిస్తామని మల్లన్న స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే, ప్రజల కోసం పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Telanagana Rajyadhikara Party Leader Face to Face | Telugu Rajyam