మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ పగటి కలలు కంటున్నారని, ఐదేళ్ల విధ్వంసం, దోపిడీలు, అత్యాచారాలు, అరాచకాలను చూసిన ప్రజలు మళ్లీ జగన్కు ఇవ్వరని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. సైకో పాలన భరించలేకే ప్రజలు 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని, భవిష్యత్లో 11 సీట్లు కూడా రావు అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అచంచల సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
అయితే వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు నిత్యం విషం చిమ్మే పనిలో నిమగ్మమయ్యారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలతో జగన్ రెడ్డి అండో కో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్కు గుర్తుకు రాని ప్రజలు..ప్రతిపక్షంలోకి రాగానే గుర్తొస్తారని, అందుకే వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్దారు. 2023లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు అభినందనీయమని, బాధ్యత గల నేతగా వైసీపీ విధానాలను నాడు ఎండగట్టి నిజజీవితంలో కూడా రియల్ హీరో అయ్యారని మద్దిపాటి ప్రశంసించారు. నియోజకవర్గంలోని గుడ్డెగూడెం గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
జగన్ చేసిన గాయాలు మానలేదు
‘ఐదేళ్ల అసమర్థ పాలనతో వైసీపీ సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా నిలబడుతున్నారని ఎమ్మెల్యే మద్దిపాటి అన్నారు. ‘అయినప్పటికీ మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేయడానికి వచ్చే వైసీపీ బ్యాచ్ అసత్య ప్రచారాలను విజ్ఞతతో, తెలివిగా తిప్పికొట్టాలని ప్రజలకు విన్నవిస్తున్నా. దోచుకున్న సొమ్మును ఏ ప్యాలెస్ లో దాచారు.? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి జగన్ రెడ్డి.?ప్రజలు చిత్తుగా ఓడించాక ప్యాలెస్ కూర్చుకుని ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో జనోద్ధారకుడిగా జగన్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘నేను జగన్ రెడ్డిని సూటిగా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. 5 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఏరోజైనా ప్రజల దగ్గరకు వెళ్లారా, ప్రజలతో మమేకమయ్యారా, కనీసం ప్రజల కష్టాలు తెలుసుకున్నారా.
ఎప్పుడైనా పేలస్ దాటి బయటకు వచ్చినా… పరదాల చాటున, భారీకేట్ల మాటున, నిర్భందాల మద్యన, బడులు బంద్ చేసి, కర్ఫ్యూ వాతావరణంలో బయటకు వచ్చిన మీరు… ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. మీరు చేసిన అరాచక విధ్వంసకర పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆ గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. ఒక్కసారి ఊళ్లలోకి వెళ్లి చూడండి. మీరు సాగించిన కల్తీ మద్యం దారుణాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజుకి కూడా ప్రజలు కిడ్నీ, లివర్ మరియు గుండెకు సంభదించిన వ్యాధులతో ప్రాణాలతో పోరాడుతున్నారు . ఇదంతా మీరు చేసి దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను. అసలు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. సీఎంలుగా పనిచేసిన వారంతా కలిసి చేసిన అప్పు కంటే.. కేవలం 5 ఏళ్లలో రెండింతలు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.
PM Modi Birthday Wishes: మోదీ నాయకత్వంపై చంద్రబాబు, పవన్ ప్రశంసలు: ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు
2024లో జగన్ రెడ్డి దిగిపోతూ… రాష్ట్రానికి రూ.9.74లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్లారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రాన్ని దివాళా తీయించి వెళ్లారు.’ అని విమర్శించారు. నేను సవాల్ చేస్తున్నా జగన్ రెడ్డికి…నీ హయాంలో ఏరోజైనా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలిచ్చావా.? సరిగ్గా పింఛన్లు ఇచ్చావా.? కానీ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వెయ్యి రూపాయల పింఛను పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల సమయం పడితే…చంద్రబాబు ఒక్క సంతకంతో ఒకేసారి పెంచారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఇదీ..చంద్రబాబుకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి’ అని స్పష్టం చేశారు.
సీఎంఆర్ఎఫ్తో 528 మందికి రూ.5.42 కోట్ల సాయం
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రజలను సీఎం ఆదుకుంటున్నారని, గోపాలపురం నియోజకవర్గంలో గతంలో కనీసం ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేదు…ఇవ్వాలన్న ఆలోచన కూడా వారికి రాలేదని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 528 మంది లబ్ధిదారులకు రూ.5.42 కోట్లు పంపిణీ చేశామని వివరించారు. ‘గుడ్డిగూడెం గ్రామాన్ని రూ. కోటితో అభివృద్ధిని చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడతామని సొల్లు కబుర్లు చెప్పిన వారిని ప్రజలు ఇంటికి పంపారు. కానీ మంత్రి నారా లోకేశ్ చేతల్లో చూపించారు. పిల్లలు సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారు.
నాణ్యత గల స్కూల్ యూనిఫార్మ్, బెల్టు, బూట్లు, బ్యాగు అందించి కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా ప్రభుత్వం పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దారు. మెగాడీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ప్రతీ ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు లోకేశ్. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని ఇప్పటికే ఏడెనిమిది సార్లు సందర్శించాను. వైసీపీ నాయకుల మాదిరిగా ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చేవాడిని కాదు…ప్రజల కోసం పని చేసే వాడు మీ మద్దిపాటి వెంకటరాజు. మీ నిబద్ధత, నిజాయితీని చూపి నాకు మద్దతుగా నిలిచి మెజారిటీ ఇచ్చిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా’ అని తెలిపారు.
పీ4తో పేదలకు జరిగే మేలును అడ్డుకోవద్దని వైసీపీని హెచ్చరిస్తున్నా
‘బుర్రలేని వైసీపీ నేతలు పీ4 గురించి విమర్శలు చేస్తున్నారు. పీ4పై అవగాహన లేకుండా మాట్లాడున్నారు. పీ4 అనేది వ్యాపారం కాదు…అదొక సామాజిక బాధ్యత. అట్టడుగున ఉన్న పేద కుటుంబాల్లో వెలుగు నింపడానికి చంద్రబాబు దార్శనికత నుంచి పుట్టిందే పీ4. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, అట్టడుగున ఉన్నవారిని దత్తత తీసుకుని వారిని ఉన్నత స్థానానికి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం లేదు. కానీ సమాజంలో వస్తున్న మార్పును, సామాజిక బాధ్యతను పెంపొందించి పేదవాడికి జరిగే మేలను అడ్డుకోవద్ద’ని వైసీపీ నేతలను ఎమ్మెల్యే వెంకటరాజు హెచ్చరించారు.



