పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా ప్యాకేజ్ తోనే ముడిపడి ఉంటాయని.. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా, కాస్త ఫాలోయింగ్ ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలని ఆలోచిస్తుంటారని.. ఆయన పార్టీపెట్టినప్పటినుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటి నుంచి వెనక్కి వెళ్లిన సందర్భాలు, ఇప్పటికీ అనుసరిస్తున్న వ్యూహాలు, చేస్తున్న ప్రయోగాలు… ఏవైనా పవన్ ప్యాకేజీ గురించే ఆలోచిస్తారనే కామెంట్లకు బలం చేకూరుస్తుందని పరిశీలకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ మరో కీలక నిర్ణయం వంటిది చేశారు.. అది నిర్ణయమా, వ్యూహమా అనేది తెలియాల్సి ఉంది!
వివరాళ్లోకి వెళ్తే… చాలా రోజుల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ తిరిగి జనసేన నేతలకు అందుబాటులోకి వచ్చారు. ఈ సందర్హంగా తెలంగాణ నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత జనసేన పార్టీ నుంచి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ పై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కారణం… ఏపీలో పొత్తుల విషయమే ఓన్ డెసిషన్ తీసుకున్న పవన్… తెలంగాణలో పోటీ విషయంలో నాయకుల అభిప్రాయాలకు విలువివ ఇస్తున్నారా.. లేక, జస్ట్ సాగతీసుతున్నారా అనే చర్చకు తాజా ట్వీట్ ఊతం ఇచ్చింది.
వాస్తవానికి 2023లో జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా 32 అసెంబ్లీ స్థానలను ఎంపిక చేసినట్లు చెబుతూ.. వాటిని అన్ లైన్ లో ప్రకటించారు. అంటే… కొన్ని నియోజకవర్గాలను జనసేన తరుపున మార్కెట్ లోకి వదిలారన్నమాట! ఇక అభ్యర్థుల మధ్య పోటీని బట్టి ఆ సీట్ల డిమాండ్ పెరిగే అవాకాశం ఉందనుకోవాలి!!
అయితే బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటున్న జనసేన, ఏపీలో టీడీపీతో కొత్తగా పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఒంటరిగా ఎలా పోటీ చేస్తుందనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. రాష్ట్రలను బట్టి బావసారూప్యతలు మారిపోతాయా అనే చర్చ కూడా నడిచింది. ఇప్పటికే ఉన్న పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందనుకున్న దశలో జనసేన అక్కడ సాధించేదేంటి అనే చర్చా తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా బీఆరెస్స్ కు లాభం చేకూర్చబోతుందని.. ఈ విషయంలో పవన్ “లెక్క” పవన్ కి ఉందనే కామెంట్లూ వినిపించాయి.
అయితే… జనసేనకు అత్యంత ప్రధాన్యమైన ఏపీలో ఎన్నికలు త్వరలో ఉండబోతుండటంతో… ఈ దశలో పరువు నిలుపుకోవాలంటే జనసేన వెనక్కు తగ్గడమే బెటర్ అనే మాటలూ వినిపించాయి. తెలంగాణలో కూడా ఒక్కటీ రాకపోతే… 2019 కి 2023 కి మధ్య జనసేన సాధించిందేమిటి అనే చర్చ ఏపీలోనూ బలంగా మొదలయ్యే ప్రమాధం ఉందనే మాటలూ వినిపించాయి. ఈ సమయంలో… భయపడి తగ్గినట్టు కాకుండా, వ్యూహాత్మకంగా వెనకడుగు వేశామని చెప్పుకోబోతున్నారా పవన్ కల్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.
ఇంతకీ తెలంగాణ నాయకులతో పవన్ భేటీ ఏమిటంటే… తెలంగాణ నాయకులంతా పోటీకి దిగాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. అయితే పవన్ వారిని బుజ్జగించారని, తనపై ఒత్తిడి ఉన్నట్టు చెప్పుకొచ్చారని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇప్పటికే పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత… పవన్ పై ఒత్తిడి రావడం ఏమిటి.. ఆయన ఎన్నికలనుంచి తప్పుకునే ఆలోచన చేయడం ఏమిటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఏపీలో టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టి వారితో పొత్తు అని, తెలంగాణలో తనపై ఇతర పార్టీల నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనుకోవడం ఏమిటో పవన్ కే తెలియాలి.
దీంతో… తెలంగాణలో జనసేన నాయకులు పోటీకి సై అంటున్నా.. రెండు రోజుల్లో ఆలోచించి చెబుతానని అధినాయకుడు వారిని పంపించారంట. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకోవడం గమనార్హం. దీంతో… ఈ ట్వీట్ తో పవన్, బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.. లేక, బీఆరెస్స్ కు హింట్ ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో బరిలో దిగుతామంటున్న టీడీపీకి కూడా పవన్ సిగ్నల్స్ పంపించారా అని ప్రశ్నిస్తున్నారు.
అంటే ఇక్కడ పవన్ తో ఎవరైనా చర్చలు జరపాలి, పోటీ వద్దు అని సర్దిచెప్పాలి, అప్పుడాయన వెనక్కి తగ్గినట్టు బిల్డప్ ఇవ్వాలి. ఈ సీన్లు జరగలేదు కాబట్టే.. నాయకుల మనసులో మాట అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారనే చర్చ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా… పవన్ కల్యాణ్ కు రాజకీయ పార్టీ అధినేతకు ఉండాల్సిన లక్షణాలేవీ లేవని… సినిమా స్టోరీ వినడం, షూటింగ్ లు చేయడం, విడుదల సమయంలో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడటం టైపే ఆలోచిస్తున్నట్లుందని అంటున్నారు పరిశీలకులు.
సరే… ఏది ఏమైనా… రెండు రోజులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై పవన్ సీరియస్ గా ఆలోచిస్తారు. అనంతరం ఒక నిర్ణయం ప్రకటిస్తారు. అది ఏమిటన్నది తెలియాలంటే… మరో రెండు రోజులు ఆగితే సరిపోతుంది!!