జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెరుపు పర్యటనలు చేస్తున్నారు. జనసేన – బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిమిత్తం, పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు జనసేనాని.
సాధారణంగా అయితే, రాజకీయ ప్రత్యర్థులపై పవన్ కళ్యాణ్ తనదైన స్టయిల్లో మాటల తూటాల్ని పేల్చేస్తుంటారు. కానీ, పవన్ కళ్యాణ్ నోట, పెద్దగా డైలాగులు పేలడంలేదు. చాలా చప్పగా సాగుతోంది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఇదేం పద్ధతి.? అంటూ జనసైనికులే గుస్సా అవుతున్నారు.
జనసేన అభ్యర్థులైతే, పోటీ చేయడం దండగ.. అని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. కేసీయార్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. అదీ చాలా చప్పగా.! అలాంటప్పుడు, ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశాలు ఇచ్చి ఏం లాభం.? అని జనసేన అభ్యర్థులు, తమ అధినేతపై గుస్సా అవుతున్నారుగానీ, బయటకు గట్టిగా చెప్పలేకపోతున్నారాయె.!
పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా జనం అయితే తండోపతండాలుగా వస్తూనే వుంటారు. వచ్చినవాళ్ళలో ఎంతమంది ఓట్లేస్తారో పవన్ కళ్యాణ్‌కి కూడా బాగా తెలుసు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి, జనసేన వల్ల కొన్ని ఓట్ల పరంగా లాభం చేకూరొచ్చు. కానీ, బీజేపీ వల్ల జనసేనకు తెలంగాణలో పెద్దగా ప్రయోజనం వుండదు.
క్రమంగా బీజేపీ ఇమేజ్ తెలంగాణలో పడిపోతున్న దరిమిలా, ఆ పార్టీకి మద్దతిచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశారన్న భావన రాజకీయ విశ్లేషకుల నుంచే కాదు, జనసేన మద్దతుదారుల నుంచీ వినిపిస్తుండడం గమనార్హం.
కేసీయార్ సన్నిహితుడట, కేటీయార్ స్నేహితుడట, రేవంత్ రెడ్డితోనూ పరిచయాలున్నాయట. కానీ, రాజకీయం వేరట.! అలాగని పవన్ కళ్యాణ్ సెలవిస్తున్నారు. పరీక్ష పేపర్ల లీక్, భూముల ధరలు.. వీటిని ప్రస్తావిస్తూ కేసీయార్ సర్కారుని తప్పు పడుతున్నారు జనసేనాని. అదీ, ఏదో మొహమాటానికి. ఇదంతా చూస్తోంటే, పవన్ కళ్యాణ్ కేవలం బీజేపీ తరఫున ప్రచారం కోసం తప్ప.. వాస్తవంగా టీఆర్ఎస్‌ని విమర్శించేంత ధైర్యం చేయలేకపోతున్నారని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తారు. ప్చ్.. పవన్ కళ్యాణ్ కష్టం.. పగవాడిక్కూడా రాకూడదు.