ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి అన్నదానికన్నా.. ఏ సమయంలో తినాలి అన్నదే అసలు కీలకం. ప్రకృతి మనకు ఇచ్చిన పండ్లలో బొప్పాయి ఒక సంపూర్ణ ఆరోగ్య ప్యాకేజ్‌లా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఉదయం నిద్రలేచిన తర్వాత శరీరం సహజంగానే డీటాక్స్ మోడ్‌లో ఉంటుంది. ఆ సమయంలో బొప్పాయి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు అది ఒక సహజ క్లీనర్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక ఎంజైమ్స్ ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడమే కాకుండా, ప్రేగుల్లో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బొప్పాయి మంచి మిత్రుడిలా మారుతుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అనవసరమైన తినుబండారాలపై కోరిక తగ్గి, మెటబాలిజం వేగవంతమవుతుంది. రోజూ ఉదయం బొప్పాయి తినడం వల్ల కొవ్వు కరిగే ప్రక్రియకు సహజంగా మద్దతు లభిస్తుంది.
ఇక రోగనిరోధక శక్తి విషయానికి వస్తే, బొప్పాయి శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి సీజనల్ జలుబులు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడే శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరం. రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.
అంతేకాదు, చర్మం మెరుపు, జుట్టు బలానికి కూడా బొప్పాయి సహజ ఔషధంలా పనిచేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో, మొటిమలు, మచ్చలను తగ్గించడంలో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
రోజూ అల్పాహారానికి ముందు ఒక చిన్న గిన్నె తాజా బొప్పాయి ముక్కలను దినచర్యలో భాగం చేసుకుంటే శరీరం మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గర్భిణీ స్త్రీలు బొప్పాయి తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు.
