PAK PM Shehbaz Sharif: కశ్మీర్ షరతుతో చర్చలకు సిద్ధమంటున్న పాక్ ప్రధాని

ఉగ్రవాద దాడులపై భారత్ తీసుకున్న తక్షణ ప్రతిచర్యల తర్వాత పాక్ పంచన భాష మార్చినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల భారత సాయుధ దళాల ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు తాళలేక పాకిస్థాన్ మెలకువపడినట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించారు. అయితే కశ్మీర్ అంశం చర్చల్లో తప్పనిసరిగా ఉండాలనే షరతు పెడుతున్నారు.

కమ్రా వైమానిక స్థావరంలో సైనికులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ సంచలనాత్మకంగా ప్రతిస్పందించింది. భారత సాయుధ దళాలు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

ఆ దెబ్బకు తేరుకోలేకపోయిన పాక్, కొన్ని భారత సైనిక స్థావరాలపై దాడి చేయాలని యత్నించింది. కానీ భారత దళాలు పకడ్బందీగా ఎదురుదాడులు చేసి, పాక్ సైనిక స్థావరాలపై పగబట్టి దాడులు నిర్వహించాయి. ఈ పరిణామాల అనంతరం మే 10న ఇరు దేశాలు ఒక అవగాహనకు రావడం ద్వారా ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గాయి.

అయితే అప్పటి నుంచి పాక్ ప్రధాని షెహబాజ్ వరుసగా సైనిక స్థావరాలను సందర్శిస్తున్నారు. బుధవారం పస్రూర్ కంటోన్మెంట్, గురువారం కమ్రా ఎయిర్ బేస్‌లో జవాన్లతో ముచ్చటించారు. భారత్‌తో శాంతి చర్చలు అవసరమన్నా, కశ్మీర్ అంశాన్ని చర్చల్లో తీసుకురావాలని పాక్ పట్టుబడుతోంది. ఇక భారత్ తరఫున పునరావృతంగా చెప్పేదేమీ లేదు.. కశ్మీర్ భారత్‌దే, అదే అంతిమ సత్యం.