పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ మరోసారి దారుణ ఘటనకు వేదికైంది. నిజాయితీతో పనిచేస్తూ బలోచ్ ప్రజల హక్కుల కోసం తన గొంతును వినిపించిన ప్రముఖ జర్నలిస్టు అబ్దుల్ లతీఫ్ బలోచ్‌ను గుర్తు తెలియని ముఠాలు అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన చలించిస్తోంది. అవరన్ జిల్లా మష్కేయ్ పట్టణంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యుల కళ్లముందే లతీఫ్‌ను కాల్చి చంపారని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.
బలోచ్ ప్రజల దైనవ స్థితిని ప్రపంచానికి తెలియజేసే రచనలు చేయడం వల్లే లతీఫ్ లక్ష్యంగా మారారని బలోచ్ సమాజం అభిప్రాయపడుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం “కిల్ అండ్ డంప్” పేరుతో జర్నలిస్టులను, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే లతీఫ్ కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇక ఇదే అవరన్ ప్రాంతానికి చెందిన యూనుస్ రసూల్, సాజిద్ బలోచ్‌లను ఇటీవలే భద్రతా దళాలు అపహరించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. వారి మృతదేహాలు అనంతరం రోడ్ల పక్కన పడేసిన తీరు, ఈ హింసాత్మక పరిణామాల తీవ్రతను సూచిస్తోంది. బలోచ్ యువత, కార్యకర్తలు, పౌరులు జీవిత భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలపై బలోచ్ యక్జేహతీ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ పత్రికా సంఘాలు, మానవహక్కుల సంస్థలు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. పాక్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉగ్రవాదానికి అంతం కావాలంటే బలోచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై గ్లోబల్ ప్రెజర్ పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.