ఓవల్ టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఇది సాధారణ విజయం కాదు… ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకుని, చివరి క్షణాల్లోనే విజయాన్ని దక్కించుకుంది టీమిండియా. ఓవల్ టెస్టులో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌పై 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీని 2-2తో సమం చేసింది భారత్.
చివరి రోజు ఇంగ్లాండ్‌కి విజయం కొద్ది దూరంలోనే ఉండగా… భారత బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచును మలుపు తిప్పారు. ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్లు ఉన్నాయి.. విజయానికి 35 పరుగులే అవసరం ఉండగా… భారత్‌కి విజయాన్నిఎవరూ ఊహించలేరు. అయితే సిరాజ్, ప్రసిద్ కృష్ణల ధాటికి ఇంగ్లాండ్ కుదేలైంది. చివర్లో అట్కిన్సన్ సిక్సర్ తో టీమిండియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించగా.. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి భారత్ కి కట్టబెట్టింది.
ఈ మ్యాచ్‌లో మొదట భారత్ బ్యాటింగ్ చేసి కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా, ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్ 5 వికెట్లతో భారత్‌ను కట్టడి చేశాడు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ 247 పరుగులకే ముగియడంతో వారికి 23 పరుగుల తేడాతో స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే, భారత రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ జైశ్వాల్ 118 పరుగుల శతకంతో చెలరేగి భారత స్కోరును 396కి చేర్చాడు.
ఇంగ్లాండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యం ముందు ఆమె ఆదిలో తడబడినా, నెమ్మదిగా పుంజుకుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 339/6తో నిలిచింది. ఐదో రోజు ఉదయం, తొలి ఓవర్ నుంచే హోరాహోరీగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లపై సిరాజ్ చెలరేగాడు. వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్ని భారత్ వైపు తిప్పాడు. ప్రసిద్ కృష్ణ మరో వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. చివర్లో అట్కిన్సన్ ఢమాల్ చేశాడు.
భారీ సిక్సర్‌తో భారత అభిమానుల దడ పుట్టించాడు. కానీ అదే సమయానికి, మరోవైపు సిరాజ్ మరొక వికెట్ తీసి విజయం టీమిండియా ఖాతాలో వేసాడు. సామాన్యమైన మ్యాచ్‌ను అసాధారణ విజయంగా మార్చిన టీమిండియా ఆత్మవిశ్వాసం, చివరి వరకూ పోరాడే పట్టుదలతో విజయాన్ని అందించారు. మొత్తానికి ఓవల్ టెస్టులోని ఈ విజయం ఇప్పట్లో మర్చిపోలేం.
