పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడికి భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రతీకార చర్యగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది దేశం పాకిస్థాన్‌పై భారిగా విరుచుకుపడింది. ఇప్పటి వరకు దీనిపై స్పష్టంగా స్పందించని పాక్ సైన్యం, తొలిసారిగా ఈ దాడిలో తాము చవిచూసిన నష్టాల వివరాలను అధికారికంగా వెల్లడించడం గమనార్హం.
ఆపరేషన్ సిందూర్‌లో 11 మంది సైనికులను కోల్పోయామని పాక్ వెల్లడించింది. వీరిలో ఆరుగురు ఆర్మీకి, ఐదుగురు ఎయిర్ ఫోర్సుకు చెందినవారిగా పేర్కొంది. అంతేకాదు, ఈ దాడిలో మరో 78 మంది సైనికులు గాయపడినట్లు కూడా వివరించింది. భారత దాడుల్లో 40 మంది పౌరులు మరణించగా, 121 మంది వరకు గాయపడినట్లు పేర్కొన్న డీజీ ఐఎస్‌పీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రాణాలు కోల్పోయినవారిలో నాయక్ అబ్దుల్ రెహమాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, సిపాయ్ అదీల్ అక్బర్ వంటి ఆర్మీకి చెందినవారు ఉన్నారు. ఎయిర్ ఫోర్సులో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ వంటి కీలక సిబ్బంది కూడా ఉండటం పాక్‌కు బలమైన దెబ్బగా చెప్పవచ్చు. ఈ మొత్తం సమాచారం పాక్ ఆర్మీ అధికారికంగా ప్రకటించడంతో భారత దాడుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, భారత్ మాత్రం తమ దాడిలో 35–40 మంది పాక్ సైనికులు హతమయ్యారని, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు పరిశీలకుల అభిప్రాయం. ఒక్కసారిగా నష్టాల లెక్క చెప్పడం కూడా అంతర్గత, అంతర్జాతీయ ఒత్తిడికి సంకేతంగా భావించవచ్చు.