రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న విషయాన్ని పక్కన పెట్టి, వాస్తవ పరిస్థితుల ఆధారంగా విశ్లేషిస్తే, తెలంగాణ రాజకీయాలకీ – ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకూ అస్సలు పొంతన లేదు.! తెలంగాణ రాజకీయం పూర్తిగా వేరు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేరు.
కులం కోణంలో చూడాల్సి వస్తే, తెలంగాణలో కుల రాజకీయాలు చాలా చాలా తక్కువ. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, అక్కడి రాజకీయాల్లో అన్నిటికీ కులమే కేంద్ర బిందువు అన్నట్లుంటుంది పరిస్థితి.
తెలంగాణ ఓటర్లేమో, ‘మా తెలంగాణ’ అన్న భావనతో వుంటారు. అదే, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, అక్కడ భిన్నమైన పరిస్థితి వుంటుంది. తెలంగాణలో కేసీయార్‌ని ధీటుగా ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి కావొచ్చు, బండి సంజయ్ కావొచ్చు.. మరికొందరు కావొచ్చు.. రాజకీయంగా బలంగానే వున్నారు. రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా.!
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, అక్కడ రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధీటైన నాయకుడు విపక్షాల్లో కనిపించడంలేదు. చంద్రబాబుకేమో వయసు మీద పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుల్ టైమ్ రాజకీయాలు చేయలేకపోతున్నారు.
చెప్పుకుంటూ పోతే, చాలా తేడాలున్నాయ్.. రెండు రాష్ట్రాల రాజకీయాల మధ్య. తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఓటర్లు కీలక పాత్ర పోషించే అవకాశం వుంది. ఏపీ ఓటర్లు అంటే, తెలంగాణలో ఓటు హక్కు వున్న ఏపీ ప్రజలు అని అర్థం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన వారు చాలా చాలా తక్కువ.. ఓటేసే విషయంలో.
తెలంగాణలో ప్రభుత్వం మారుతుంది గనుక (ఎగ్జిట్ పోల్ అంచనాల్ని బట్టి), ఇదే మార్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చూడబోతున్నామన్న విశ్లేషణ అత్యంత హాస్యాస్పదం.!