పాపం నిమ్మగడ్డ.. భంగపాటు తప్పేలా లేదే.!
ప్రభుత్వం వద్దంటున్నాసరే, స్థానిక సంస్థల నిర్వహణకు ముందడుగు వేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాధించిందేంటీ.? పరిషత్ ఎన్నికలు ఇంకా జరగాల్సి వుంది. పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి.. అన్నటిలోనూ అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యం సాధించింది విపక్షాల మీద. నిమ్మగడ్డ మీద చాలా అంచనాలు పెట్టుకున్న ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభాసుపాలయ్యింది ప్రజాక్షేత్రంలో.
నిమ్మగడ్డను చంద్రబాబే నడిపిస్తున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. ఈ క్రమంలో చాలా వివాదాలు నడిచాయి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నిమ్మగడ్డపై అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేయడం, ప్రివిలేజ్ కమిటీ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించడం.. చకచకా జరిగిపోయాయి. అదికార పార్టీ మీద నిమ్మగడ్డ ఆంక్షలు, హద్దలు మీరాయన్న విమర్శలు లేకపోలేదు. ఈ క్రమంలో కోర్టు నుంచీ షాకులు తినేశారు నిమ్మగడ్డ.
మరోపక్క, పంచాయితీ సహా మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో నిమ్మగడ్డ ద్వారా ఏమీ సాధించలేకపోయామన్న అక్కసుతో, నిమ్మగడ్డ మీదనే టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇక, ఇప్పుడు నిమ్మగడ్డ పరిస్థితేంటి.? త్వరలో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయబోతున్నారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త. విచారణకు అందుబాటులో వుండాల్సిందిగా నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ సూచన మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపనున్నారు. నిమ్మగడ్డ పదవిలో వున్నా, లేకపోయినా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ చెబుతుండడం గమనార్హం. గతంలో ఇలాంటి ఓ కేసుని ఉదహరిస్తూ, నిమ్మగడ్డ పనైపోయినట్టేనీ, టీడీపీని నమ్ముకుని ఆయన నట్టేట్లో మునిగిపోయారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.