ఆఫీస్ లేదా ఆసుపత్రి.. ఫ్యాక్టరీ లేదా ట్రాన్స్‌పోర్ట్ రంగం.. నేటి కాలంలో రాత్రి షిఫ్ట్ అనేది ఒక సాధారణ జీవన భాగంగా మారిపోయింది. కానీ తాజా పరిశోధనలు మాత్రం ఆందోళన కలిగించే విషయాన్ని బయటపెట్టాయి. రాత్రిపూట నిరంతరం పనిచేసే ఉద్యోగుల్లో, పగటి వేళల్లో పనిచేసేవారితో పోలిస్తే, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉంటుందని కొత్త అధ్యయనం చెబుతోంది.
నిపుణుల ప్రకారం, రాత్రిపూట పనిచేయడం వలన మన శరీరంలోని సహజ జీవక్రియల గడియారం (బయోలాజికల్ క్లాక్) దెబ్బతింటుంది. నిద్రలేమి, అసమయ భోజనం, శరీరానికి తగినంత నీరు అందకపోవడం వలన క్రమంగా లవణాలు, ఖనిజాల సమతుల్యం తప్పిపోతుంది. ఈ మార్పులే కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు.
ఇక నైట్ షిఫ్ట్ జీవనశైలి సమస్యను మరింత విషమం చేస్తుంది. రాత్రిపూట మేల్కొని పని చేసే వారు ఎక్కువగా కాఫీ, టీ, జంక్ ఫుడ్‌కే పరిమితం అవుతారు. కొందరు సిగరెట్ లేదా మద్యం అలవాటుకు బానిస అవుతారు. పగటిపూట పూర్తి విశ్రాంతి లేకపోవడం, అధిక బరువు పెరగడం కూడా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
కిడ్నీ రాళ్ల లక్షణాలు మొదట చిన్నగా కనిపించినా, అవి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. వీపు లేదా పొత్తికడుపులో భరించలేని నొప్పి, మూత్రంలో మంట లేదా రక్తం, తరచూ వాంతులు, వికారం ఇవన్నీ ప్రధాన హెచ్చరికలుగా గుర్తించబడ్డాయి. ఒకసారి కిడ్నీ రాళ్లు ఏర్పడితే చికిత్సకు ఎక్కువ సమయం, ఖర్చు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి పనిచేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రాత్రి షిఫ్ట్ చేసే వారు రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు త్రాగాలి.
ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక ఉప్పు, జంక్ ఫుడ్‌ను పూర్తిగా నివారించాలి.
శరీరం కదిలేలా చిన్న వ్యాయామాలు, స్ట్రెచింగ్ తప్పనిసరిగా చేయాలి.
నిద్రపోయే సమయంలో చీకటి, ప్రశాంత వాతావరణంలో 6–8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
ఏడాదికి ఒకసారి అయినా కిడ్నీ, లివర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
డాక్టర్లు చెబుతున్నట్లుగా, చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీ రాళ్ల సమస్యను పూర్తిగా నివారించడం సాధ్యమే. రాత్రిపూట పనిచేసే వారు కూడా సరైన ఆహారం, నీరు, నిద్ర, వ్యాయామం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
