డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు.. వైద్యుల హెచ్చరిక ఇదే..!

ప్రస్తుతం జీవితంలో గడియారం మన చేతిలో లేదు.. ఉద్యోగాల షిఫ్టులు, ట్రాఫిక్ ఒత్తిడి, మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోయిన అలవాట్లు.. ఇవన్నీ కలిసి భోజనం, నిద్ర రెండింటినీ గందరగోళం చేస్తున్నాయి. ముఖ్యంగా నగరాల్లో పనిచేసే వారిలో సరైన సమయంలో తినడం, సమయానికి నిద్రపోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇంటికి చేరేసరికి రాత్రి బాగా ఆలస్యమవుతుంది. ఆకలి ఉంటే తినేసి వెంటనే పడుకోవడం… ఇదే రోజువారీ రొటీన్. కానీ ఇదే అలవాటు నెమ్మదిగా శరీరాన్ని లోపల నుంచి దెబ్బతీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రాత్రి భోజనం, నిద్ర మధ్య సరైన గ్యాప్ లేకపోతే జీర్ణక్రియ అస్తవ్యస్తమవుతుంది. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండానే శరీరం విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఫలితంగా యాసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట, నిద్రలో తరచూ మేలుకోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇవి కొనసాగితే బరువు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత, మెటబాలిజం మందగించడం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తాయి.

వైద్యుల మాటల్లో చెప్పాలంటే.. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఒక సాధారణ కానీ కీలకమైన నియమం ఉంది. అదే రాత్రి పడుకునే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం ముగించాలి. ఉదాహరణకు రాత్రి 10 గంటలకు నిద్రపోతే, విందు 7 నుంచి 8 గంటల మధ్య పూర్తవ్వాలి. 11 గంటలకు పడుకునే వారు అయితే 8 గంటలకల్లా తినడం మంచిది. ఇలా చేయడం వల్ల పడుకునే సమయానికి పొట్ట తేలికగా ఉంటుంది. నిద్ర లోతుగా, ప్రశాంతంగా పడుతుంది.

భోజనం చేసిన వెంటనే పడుకుంటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలకు కారణమవుతుంది. అంతేకాదు, నిద్ర సమయంలో శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. మెదడుకు సరైన విశ్రాంతి దొరకదు. అందుకే భోజనం, నిద్ర మధ్య గ్యాప్ అనేది ఆరోగ్యానికి చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు.

ఇక రాత్రి ఏం తినాలి అన్నది కూడా అంతే ముఖ్యం. తేలికగా జీర్ణమయ్యే ఆహారమే రాత్రి పూట శ్రేయస్కరం. ఉడికించిన కూరగాయలు, పప్పు, కిచిడి, రోటీ లేదా కొద్దిగా అన్నం, స్వల్పంగా వేడి చేసిన పసుపు పాలు, కొన్ని బాదం లేదా వాల్నట్లు తీసుకోవచ్చు. పెరుగును కూడా చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. అయితే భారీ భోజనాలు, వేయించిన పదార్థాలు, కారం ఎక్కువగా ఉండే వంటకాలు, తీపి స్నాక్స్, టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలు రాత్రిపూట దూరంగా ఉంచితేనే మంచిది. ఇవన్నీ నిద్రను భంగం చేయడమే కాకుండా జీర్ణవ్యవస్థపై అదనపు భారం వేస్తాయి. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం చిన్న విషయం అనిపించినా.. అదే ఆరోగ్యానికి బేసిక్ ఫౌండేషన్. రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు, నిద్ర నాణ్యత మెరుగవుతుంది, శరీరం హాయిగా పనిచేస్తుంది అని వైద్యులు సూచిస్తున్నారు.