India vs Pakistan: నీటి దారులే యుద్ధ వేదికలవుతాయా? భారత్–పాక్ మధ్య కొత్త ఉద్రిక్తత

ఇప్పటి వరకూ తుపాకులు, ఆర్మీ తరలింపులతో మేలుకొలిపే భారత్–పాక్ సరిహద్దు ఈసారి నీటి దారుల చుట్టూ ఉద్రిక్తతను చవిచూస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తక్షణమే ప్రతిస్పందన చర్యలకు దిగగా, దాని పరిణామాలు ఇప్పుడు సింధు నదీ ఒప్పందాన్ని ముప్పుపెట్టే స్థాయికి చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా అనేక యుద్ధాలు జరిగినా నిలబడిన ఈ ఒప్పందాన్ని భారత్ ప్రస్తుతానికి నిలిపివేసినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఒప్పందంలోని హక్కులను వినియోగించుకునే దిశగా భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చీనాబ్ నదిపై రాన్‌బీర్ కాలువను విస్తరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే, పశ్చిమ నదుల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు నీటి మళ్లింపునకు సంబంధించి పలు ప్రతిపాదనలు ప్రణాళికలో ఉన్నాయి. ఇది అమలవుతే పాకిస్థాన్‌కు చేరే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇది పాకిస్థాన్‌కు వ్యవసాయం, విద్యుత్, ఆహార భద్రత పరంగా పెద్ద ఎదురుదెబ్బగా మారుతుంది. ఇస్లామాబాద్ ఇప్పటికే నీటి మట్టాలు 90 శాతం తగ్గాయని ప్రకటించగా, భారత్ చర్యలను ‘యుద్ధానికి సమానం’గా పరిగణిస్తామని హెచ్చరించింది. ఎన్నో ఏళ్ల పాటు నిలబడిన చారిత్రక ఒప్పందం దెబ్బతిన్నా, దేశ భద్రతే ప్రథమమని భారత్ సంకేతాలు పంపుతోంది. నీటి ప్రవాహాలు మారుతున్న ఈ సంక్లిష్ట సమయంలో భారత్ పాక్ సంబంధాలు మరో కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.