Tea: టీ అంటే ఇష్టమా.. అయితే చక్కెరకు బదులుగా ఇది కలిపితే మీ గుండె సేఫ్..!

భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం కాదు, అది జీవనశైలిలో విడదీయరాని భాగం. ఉదయం కప్పు టీ లేకుండా చాలామంది రోజు మొదలవదు. సాయంత్రం అలసట తొలగించుకోవడానికి కూడా టీనే మొదటి ఆప్షన్. అయితే మనం తాగే టీ ఎక్కువగా చక్కెరతో నిండిపోతుంది. ఈ చక్కెర క్రమంగా డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు, చర్మ సమస్యల రూపంలో ఆరోగ్యానికి పెద్ద శత్రువుగా మారుతుంది. అందుకే ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు చక్కెరకి బదులుగా సహజమైన తీపి పదార్థాలను ఎంచుకుంటున్నారు. ఇవి టీకి రుచి మాత్రమే కాకుండా శరీరానికి పోషణను కూడా అందిస్తాయి.

తేనెతో తయారైన టీ తాగితే జీర్ణవ్యవస్థ బాగుంటుంది, శక్తి పెరుగుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీని మరిగించి స్టవ్‌ నుంచి దింపిన తర్వాతే తేనె కలపాలి. అలా చేస్తే తేనెలోని యాంటీఆక్సిడెంట్లు చెడిపోవు. మరోవైపు బెల్లం టీ గ్రామీణ వాసుల జీవితంలో ఇంకా కొనసాగుతున్న ఒక మధురమైన సంప్రదాయం. బెల్లం సహజంగానే ఇనుము, ఖనిజాలతో నిండి ఉండటం వల్ల రక్తహీనత నివారించడంలో తోడ్పడుతుంది. చలికాలంలో బెల్లం టీ తాగితే శరీరానికి వెచ్చదనం ఇస్తుంది.

ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉన్న ములేఠీ లేదా యష్టిమధుకం టీకి సహజమైన తీపి రుచి ఇవ్వడంతో పాటు దగ్గు, జలుబు, గొంతు సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క, లవంగం కలిపి ములేఠీ టీ తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అదే విధంగా ఖర్జూరం సిరప్ కూడా మంచి ఆప్షన్. ఇది సహజంగానే శక్తివంతమైన స్వీటెనర్. ముఖ్యంగా బరువు పెరగాలనుకునేవారికి లేదా శక్తి తక్కువగా అనిపించే వారికి ఇది అద్భుతమైన ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

ఇక ఎండుద్రాక్ష, ఎండుఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ను పాలలో ఉడికించి టీలా తీసుకోవచ్చు. ఇది టీకి సహజ తీపిని ఇవ్వడమే కాకుండా విటమిన్లు, ఫైబర్, ఖనిజాలతో శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ డ్రై ఫ్రూట్స్ టీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇదీ చదవండి: కలలో పాములు ఇలా భయపెడుతున్నాయా.. అయితే మీ జీవితంలో ఆ కష్టాలు తప్పవు ..!

పోషకాహార నిపుణుల మాటల్లో చెప్పాలంటే రోజూ తాగే టీని సహజ తీపి పదార్థాలతో మార్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది కేవలం జీవనశైలిలో ఒక చిన్న మార్పు మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే అనేక వ్యాధులను నివారించే రక్షణా కవచం కూడా అవుతుంది. అందువల్ల ఇక నుంచి టీ తాగేటప్పుడు చక్కెర బదులు సహజమైన తీపిని ఎంచుకోండి. మీ కప్పు టీ కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మిత్రంగా మారుతుంది.