ప్రధాని నరేంద్ర మోడీ ఇంకోసారి ‘జమిలి’ ఎన్నికల అవసరం గురించి మాట్లాడటంతో, దేశవ్యాప్తంగా ఇప్పుడీ అంశం మరోమారు ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. ఏదో ఆషామాషీగా జరుగుతున్న చర్చ కాదిది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. అనే నినాదం పాతదే. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అన్నట్లు తయారైంది పరిస్థితి. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ.. ప్రత్యేక అవసరాలున్నాయి.. జాతీయ పార్టీలకు సంబంధించి. దాంతో, ఎవరూ జమిలిపై ‘రిస్క్’ తీసుకోలేదు.!
మోడీ జపం.. అసలేంటి ఈ రాజకీయం.?
దేశంలో భారతీయ జనతా పార్టీకి సరైన ప్రత్యామ్నాయమంటూ లేదిప్పుడు. కొడితే, ఇప్పుడే దెబ్బ కొట్టాలి. ప్రాంతీయ పార్టీలేవీ జాతీయ స్థాయిలో ఓ కూటమిగా ఏర్పడకూడదంటే, జమిలి ఎన్నికలు తీసుకొచ్చేయాలి. అలా చేస్తే, అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ అయోమయంలో పడిపోతాయి. తద్వారా దేశంలో బీజేపీకి తిరుగుండదు. అదే సమయంలో, ప్రాంతీయ పార్టీల బలహీనతల్ని బీజేపీ సొమ్ము చేసుకోవచ్చు.. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయొచ్చు.
రాజకీయమే కాదు, అభివృద్ధి కూడా.!
రాజకీయ మాత్రమే, జమిలి ఎన్నికల నినాదం వెనుక వుందని చెప్పలేం. అది కూడా ఓ బలమైన కారణం మాత్రమే. దేశాభివృద్ధికి జమిలి ఎన్నికలు అత్యంత అవసరం. ఎందుకంటే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా, అక్కడ కోడ్ అమల్లో వుంటుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కొంత ఇబ్బంది కలుగుతుంది. అదే, ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఆ సమస్య వుండదు. అభివృద్ధి సమానంగా విస్తరించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
నష్టాలూ వున్నాయ్..
జమిలి ఎన్నికలతో ప్రధాన సమస్య, రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం. ఏదన్నా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వస్తే, అప్పుడు ఏం చేస్తారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సంక్షోభం దేశంలో కూడా రావొచ్చు. దేశంలో సంక్షోభం వస్తే, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా తమ పదవీ కాలాన్ని ముగించేసుకోవాలా.? అలా జరగకపోతే, జమిలికి అర్థమే వుండదు. ఏమో, ఏం జరుగుతుందోగానీ, జమిలి వైపే ఎక్కువమంది మొగ్గు చూపుతుండడం గమనించాల్సిన అంశం.