దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించేందుకు ధైర్యంగా ముందుకొచ్చే ముఖ్యమంత్రులు అతికొద్ది మంది మాత్రమే. అందులో మమతా బెనర్జీది తొలి స్థానం. ‘కేంద్రంతో సఖ్యత కోరుకుంటాం..’ అంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నాయి నొక్కులు నొక్కడం మామూలే. సమాఖ్య స్ఫూర్తి.. అన్నదెప్పుడో అటకెక్కిపోయింది. అంతా ఇప్పుడు రాజకీయమే నడుస్తోంది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకడలు రాష్ట్రాలకు శాపంగా మారుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించాల్సిన కేంద్రం, కొంత మేర మాత్రమే ఉచితంగా ఇస్తామని చెబుతూ రాష్ట్రాలు సొంతంగా మిగిలిన వ్యాక్సిన్లను కొనుక్కోవాలనీ, ప్రజలూ అవసరమనుకుంటే డబ్బులు చెల్లించి ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లను వేయించుకోవాలని కేంద్రం చేసిన సూచనలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ విషయమై కేంద్రం తీరుని పలుమార్లు తీవ్రంగా తప్పు పట్టింది. ఇక, మారుతున్న పరిణామాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఈ లిస్టులో తాజాగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చేరారు. రాష్ట్రాలన్నిటిదీ ఒకే స్వరమై వుండాలన్నది వైఎస్ జగన్, తాజాగా వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖల తాలూకు సారాంశం.
వాస్తవానికి, కరోనా మొదటి వేవ్ సమయంలోనే రాష్ట్రాలు, కేంద్రానికి స్పష్టమైన సంకేతం పంపి వుండాలి.. లాక్ డౌన్ తదనంతర పరిణామాలపై. రాష్ట్రాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. రెండో వేవ్ సందర్భంగా అసలు మారటోరియం అన్న ప్రస్తావనే కేంద్రం చేయడంలేదు. నిజానికి, కేంద్రం పెట్టాల్సిన లాక్ డౌన్.. పెట్టనే లేదు. ఆ పాపం రాష్ట్రాలదేనని తేల్చేసింది. ఇంతటి బాధ్యతారాహిత్యమా.? ఈ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించాల్సిందే. కానీ, ప్రశ్నించేందుకు అన్ని రాష్ట్రాలూ ఒక్కటవుతాయా.? లేదా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.