సెకెండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ప్రధానంగా యువత ఈ సెకెండ్ వేవ్ దెబ్బకి విలవిల్లాడుతోంది. యువత, మధ్య వయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు సెకెండ్ వేవ్ సందర్భంగా. వీరిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనధికారిక మరణాల సంఖ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతా జరుగుతున్నా, దేశంలో 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయసువారికి వ్యాక్సిన్ సరైన రీతిలో అందుబాటులో లేదు. మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం వుందన్న ప్రచారం నేపథ్యంలో, అప్పటికి పరిస్థితి ఎలా వుంటుందో ఏమో.
చిన్న పిల్లలకు వ్యాక్సిన్ విషయమై ఇంకా పరిశోధనలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఆ మాటకొస్తే, ఇప్పుడు అందుబాటులో వున్న వ్యాక్సిన్లు కూడా అత్యవసర వినియోగం కింద మాత్రమే అనుమతులు పొందాయి. వ్యాక్సినేషన్ విషయమై కేంద్రంలోని మోడీ సర్కార్ పూర్తిస్థాయిలో విఫలమయ్యిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండానే వ్యాక్సిన్ ఉత్సవాన్ని చేపట్టడం చూస్తోంటే, పబ్లిసిటీ మీద యావ తప్ప, ప్రజల పట్ల కనీస బాధ్యత పాలకులకు లేదన్న విషయం అర్థమవుతుంది. ఎలా.? ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం ఎలా ఎదుర్కొనగలుగుతుంది.? సెకెండ్ వేవ్ దెబ్బకి దేశంలో చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. చాలా కుటుంబాలు తమ ఇంటి పెద్దను కోల్పోయాయి. అయినా, కేంద్రం.. ప్రజల ఆర్థిక ఇబ్బందుల్ని అడ్రస్ చేయలేకపోతుండడం అత్యంత బాధాకరమైన విషయం.