హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్లలో చిక్కుకుని 13 మంది సజీవదహనం..!

హాంకాంగ్ నగరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉత్తర హాంకాంగ్‌లోని తై పో ప్రాంతంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా చెలరేగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది సజీవదహనమైనట్లు అధికారులు ధృవీకరించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం వేళ వాంగ్ ఫుక్ కోర్ట్ అనే ఎనిమిది భారీ బ్లాకులతో కూడిన హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్ని జ్వాలలు పై అంతస్తులకు వ్యాపించడంతో, భవనాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. దాదాపు 2,000 నివాస యూనిట్లు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో వందలాది మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో అనేక మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే 700 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ క్రేన్లు, హైడ్రాలిక్ లాడర్లు, బహుళ ఫైర్ ఇంజన్‌ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో స్కాఫోల్డింగ్ ఫ్రేములు కూలిపోతుండటం సహాయక చర్యలకు తీవ్ర అవరోధంగా మారింది. రోడ్లన్నీ అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్‌లతో నిండిపోయాయి.

నాలుగు దశాబ్దాలుగా అదే కాంప్లెక్స్‌లో నివసిస్తున్న హ్యారి చెయుంగ్ (66) ప్రమాద భయానకతను కళ్లారా చూశానని వాపోయారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, వెంటనే పొగలు ఎగసిపడుతున్న దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యానని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమైన కొద్ది వస్తువులు తీసుకుని బయటకు పరుగులు తీశానని, ఇప్పుడు ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నానని కన్నీళ్లతో తెలిపారు.

దగ్గరలోని ఓవర్‌హెడ్ వాక్‌వేపై ప్రజలు గుమిగూడి, మంటల్లో కాలి బూడిదవుతున్న అపార్ట్‌మెంట్లను చూసి భయాందోళనకు గురవుతున్నారు. కొందరు వీడియోలు, ఫొటోలు తీస్తుండగా, మరికొందరు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆస్పత్రుల వద్ద గాయపడిన వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు హృదయ విదారకంగా మారాయి.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం పూర్తి నివేదికను విడుదల చేస్తామని హాంగ్‌కాంగ్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. నగర చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్నిప్రమాదాలలో ఒకటిగా నమోదు కానుందని అధికారులు చెబుతున్నారు.