రేణిగుంటలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మునోత్ గ్రూప్ లిథియం బ్యాటరీ తయారీ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని బ్యాటరీలు, యంత్ర సామాగ్రి, ముడిసరుకు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: పలు కీలక అంశాలపై చర్చ
వివరాల్లోకి వెళ్తే, తిరుపతి జిల్లా, రేణిగుంట విమానాశ్రయం సమీపంలో ఉన్న డెక్సన్ మొబైల్ కంపెనీ పక్కనే ఉన్న మునోత్ గ్రూప్ బ్యాటరీ తయారీ యూనిట్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదాన్ని గమనించిన కంపెనీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి దాదాపు 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. సుమారుగా 10 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఫ్యాక్టరీలో ఉన్న లిథియం బ్యాటరీలు, ఇతర రసాయనాల కారణంగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ, అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఫ్యాక్టరీలో ఇంకా పొగలు వస్తున్నాయని, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం స్థానికంగా ఆందోళనకు దారితీసింది.


