ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్–పాక్ మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణపై రాజకీయంగా చర్చలు ముదురుతున్నాయి. పాక్ పక్కన చైనా తయారు చేసిన తక్కువ ఖర్చు డ్రోన్లను ప్రయోగించగా, మన సైన్యం అత్యాధునిక క్షిపణులతో వాటిని కూల్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ్‌పూర్‌లో జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ – ‘‘రూ.15 వేలు విలువ చేసే డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువ చేసే క్షిపణులను ఎందుకు వినియోగించాలి? ఇది సరైన వ్యూహమా?’’ అని ప్రశ్నించారు. డ్రోన్‌ల వ్యయానికి మించిన ఖర్చుతో ఆపరేషన్ చేయడంపై విమర్శలు గుప్పించారు. ఇది పన్ను చెల్లింపుదారుల ధనాన్ని వృథా చేయడమేనని ఆరోపించారు.
అలాగే, కేంద్రం పాక్ ఉగ్రస్థావరాలపై బాంబులు వేసినట్లు ప్రకటించినా, తాము ఎదుర్కొన్న నష్టం గురించి మాత్రం మౌనం వహించడం అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. పాక్ ప్రభుత్వం భారత్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఆరోపిస్తే, దానికి సంబంధించిన నిజాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు. సైనిక విజయం పేరుతో నమ్మించే ప్రయత్నం కాకుండా, పారదర్శక సమాచారాన్ని అందించాలన్నారు.
ఈ వ్యాఖ్యలతో మరోసారి జాతీయ భద్రత అంశంపై రాజకీయ వాదనలు తెరపైకి వచ్చాయి. దేశ రక్షణ విషయంలో ఖర్చు గురించి కాకుండా భద్రతే ముఖ్యమని అధికార వర్గాలు చెబుతుండగా, వ్యూహాత్మక నిర్ణయాల వెనుక ఉన్న ఖర్చుపై ప్రశ్నలు వేసే ధైర్యం కూడా అవసరమేనని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఇక ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి.