చుట్టీలు పెడుతున్న చినబాబు… ఒక మెతుకు చాలు..!!

అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే… మొత్తం పట్టుకుని చూడక్కరలేదు.. ఒక మెతుకు పట్టుకుని చూసినా సరిపోతుందంటారు. ఇప్పుడు ఈ మాట ఎందుకనేది చివర్లో చూద్దాం!

యువగళం అంటూ పాదయాత్ర మొదలుపెట్టారు చినబాబు లోకేష్. ఈ యాత్రం ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికీ ప్రజలకు క్లారిటీ రాలేదన్నా అతిశయోక్తి కాదేమో! ముఖ్యమంత్రిని, ఆయా జిల్లాల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను వ్యంగ్యంగా, అసభ్యంగా తిట్టడానికన్నట్లు ప్రస్తుతానికైతే సాగుతుంది.

సమస్యల అధ్యయనం.. నేనున్నాననే నమ్మకం కలిగించడం.. ఇప్పటివరకూ జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జనాలు వారికి వారే వచ్చి సమస్యలు చెప్పుకునే స్థాయిలో చినబాబు నడవడిక ఉండటం లేదనేది మరో కామెంట్. సీరియస్ నెస్ లేకుండా ఏ పని చేసినా.. దాని ఫలితం దారుణంగా ఉంటుందనేది తెలిసిన విషయమే. మరి ఆ సీరియస్ నెస్ మాటల్లోనూ లేదు, నడకలోనూ లేదు, నడతలోనూ లేదు!!

ఇదే క్రమంలో… యాత్ర ప్రారంభమై నెలరోజులు కూడా కాకముందే… చినబాబు సెలవులు తీసుకోవడం, రోజుకి పెట్టుకున్న 10కి.మీ. టార్గెట్ ని కూడా ఫినిష్ చేయకుండా.. నాగాలు పెడుతున్న పరిస్థితి! అవును… ఒంట్లో నలతగా ఉందని ఒకరోజు కేవలం 3 కి.మీ.తోనే సరిపెట్టిన లోకేష్.. ఇంకోరోజు కేవలం సభకు మాత్రమే హాజరయ్యారు. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకుని మరో రోజు విరామం ప్రకటించిన లోకేష్.. తాజాగా తారకరత్న మృతితో మూడురోజులు విరామం ప్రకటించారు.

తారకరత్న మృతి గురించి విరామం తీసుకోవడం సంగతి మినహా… మిగిలినవి పరిశీలిస్తే.. చినబాబుకు పాదయాత్ర గొప్పతనం తెలియదనుకోవాలా లేక సీరియస్ నెస్ కొరవడిందని భావించాలో తెలియక తమ్ముళ్లు చికాకు పడుతున్న పరిస్థితి!

ఇంతకాలం వైఎస్సార్, చంద్రబాబు, జగన్, షర్మిళ ల పాదయాత్రల్లో వారు కనబరిచిన కమిట్ మెంట్, సీరియస్ నెస్ అనేవి.. చినబాబు యాత్రలో ఏ కోసానా కనబడటం లేదనేది మరో కామెంట్! ఇలా శివరాత్రి అని, రెండో శనివారం అని, కాలెండర్ లో ఎర్ర అక్షరాలు ఉన్న ప్రతిరోజూ యాత్రకు విరామం ఇచ్చుకుంటే… 2024 ఎన్నికలు సమీపించేస్తాయనడంలో సందేహం లేదనేది మరో కామెంట్!

మరి చినబాబు ఇకపై అయినా సీరియస్ గా, సెలవులు పెట్టకుండా, బద్దకించకుండా యాత్రను పూర్తి సీరియస్ నెస్ తో ముగిస్తారా లేక.. ఇలా చుట్టీలు పెడతారా అన్నది వేచి చూడాలి! సో… ముందు చెప్పుకున్నట్లుగా యాత్ర మొత్తం చూడక్కర్లేదు.. ఒక రోజు చూస్తే సరిపోతుందనుకోవాలా?