కిడ్నీలను కాపాడుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, కాలుష్యం, సరైన అవగాహన లేకపోవడం వంటివి కిడ్నీ సమస్యలను గణనీయంగా పెంచుతున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులకే ఎక్కువగా కనిపించే మూత్రపిండాల సమస్యలు, ఇప్పుడు యువతలోనూ సాధారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలు కిడ్నీలకు ఎక్కువ ప్రమాదం కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

వీటి కారణంగా కిడ్నీలు దెబ్బతినడం క్రమంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య ప్రారంభ దశల్లో కాస్త వాపు, బీపీ పెరగడం వంటి చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇవి చాలా సార్లు గుర్తించలేమని చెబుతున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్రమంగా కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, హై బీపీను సరిగ్గా నియంత్రించకపోవడం మూత్రపిండాల ఫిల్టరింగ్ యూనిట్స్‌ని దెబ్బతీస్తుందని అంటున్నారు.

ఇక ప్రస్తుత కాలంలో బయట తినే అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ ఉప్పు తినడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం మూత్రపిండాలకు మిగతా సమస్యలకంటే ఎక్కువగా హాని చేస్తాయి. ఎక్కువ ఉప్పు రక్తపోటును పెంచి, కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుంది. అందులోనూ తగినంత నీరు తాగని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌ అవుతూ కిడ్నీ పనితీరు మరింతగా తగ్గిపోతుంది.

ఇంకా డెస్క్ జాబ్స్ వల్ల శారీరక చలనం లేకుండా పోయి, ఊబకాయం పెరుగుతోంది. ఈ ఊబకాయమే టైప్ 2 డయాబెటిస్‌, అధిక బీపీ సమస్యలకు కారణం అవుతూ కిడ్నీలకు నెమ్మదిగా దెబ్బలు పెడుతుంది. పైగా, సీసం, కాడ్మియం, ఆర్సెనిక్‌ వంటి జఠిల లోహాల కారణంగా పర్యావరణం కూడా మూత్రపిండాలకు ముప్పుగా మారుతోంది.

కిడ్నీ ఆరోగ్యం తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేసుకోవచ్చు. అయితే చాలా మంది చివరి దశకు చేరాకే సమస్యను గుర్తిస్తారు. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి వంటి పరిష్కారాలు కూడా ఉన్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జీవనశైలి మార్పులు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. బరువును అదుపులో ఉంచాలి. శరీరానికి కావలసినంత నీరు తాగాలి. ఈ చిన్నచిన్న జాగ్రత్తలే ఈ రోజుల్లో కిడ్నీలను కాపాడే రక్షకవలయంగా పనిచేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.