కేరళలో టిఫిన్ బాక్స్ లో బాంబు… తెరపైకి విస్తుపోయే నిజాలు..!

కేరళలో ఆదివారం ఉదయం జరిగిన పేలుళ్ల ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. ఒక కన్ వెన్షన్ హాల్లో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ పేలుళ్లలో సంభవించాయి. ఈ పేలుళ్లు జరిగిన సమయంలో ఆ ప్రార్థనల్లో సుమారు 2000 మందిపైగా భక్తులు పాల్గొన్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా టిఫిన్ బాసుల్లో భారీ పేలుడు ప్రదార్ధం ఐఈడీ కారణంగానే పేలుళ్లు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలుస్తుంది.

ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిలో 10 మంది 50శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఈ పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారని తెలుస్తుంది!

ఈ ఘటనపై కేరళ డీజీపీ షేక్‌ దార్వేశ్‌ సాహెబ్‌ స్పందించారు. ఇందులో భాగంగా… ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రెండు పేలుళ్లు జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కలమస్సెరీలోని జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఉదయం 9:40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించిందని వెల్లడించారు. ఇదే సమయంలో… భారీ పేలుడు పదార్థం ఐఈడీ కారణంగానే ఇది సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు.

ఇదే సమయంలో ఇందులో ఉగ్రకోణం ఏమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దర్యాప్తు తర్వాతే ఏ విషయమైనా చెప్పగలమని కేరళ డీజీపీ తెలిపారు. ఇదే సమయంలో… పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోపక్క… ఘటనా స్థలానికి ఇప్పటికే ఎన్.ఐ.ఏ. తో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు చేరుకున్నట్లు కేరళ మంత్రులు పేర్కొన్నారు.

ఘటన అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అక్కడి పరిస్థితులను ఆరా తీశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు బృందాలను పంపించినట్లు చెప్పారని సమాచారం. మరోపక్క ఈ ఘటన విషయంలో సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్‌ లు వ్యాప్తి చేయొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.