Y.S Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించడమే కాకుండా జగన్ పొలిటికల్ క్రిమినల్ అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో లింగమయ్య అనే వ్యక్తిని పరిటాల వర్గీయులు హత్య చేసి చంపడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఇక ఈ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాటలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా , వివిధ వర్గాల్లో అసహనం, విభేదాలు తలెత్తేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లావు శ్రీకృష్టదేవరాయలు లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ భద్రత లోపాల పై డ్రామాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. పాపిరెడ్డిపల్లి పర్యటనను తన రాజకీయ స్వలాభం కోసమే వాడుకున్నారని తెలిపారు. వాస్తవంగా హెలికాప్టర్‌కు ఏమీ కాలేదంటే, 12.56కి దెబ్బతిందని చెబితే అదే హెలికాప్టర్ 1 గంటకే ఎలా టేకాఫ్ అయింది? అంటూ ప్రశ్నలు వేశారు.
గత కొంతకాలంగా జగన్ పోలీసు అధికారులను బెదిరించడం, ధ్వంసాత్మక వ్యాఖ్యలు చేయడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటోందని, పోలీసులపై బహిరంగంగా హెచ్చరికలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను రాజకీయ ప్రత్యర్థులపై వాడుకుని, ఇప్పుడు అదే అధికారులపై బురదజల్లుతున్నారని శ్రీకృష్ణదేవరాయలు విమర్శించడమే కాకుండా జగన్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అంటూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గురించి తీయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.