నిజామాబాద్‌లో పసుపు రైతుల కోసం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆపరేషన్ కగార్‌పై స్పందించారు. కార్యాలయ ప్రారంభం తర్వాత ఏర్పాటు చేసిన కిసాన్ సభలో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు.
మావోయిస్టులు హత్యలు, ఉద్యమాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని.. లేదంటే వారి వేట ఆగదన్నారు. 2026 మార్చ్ 31లోపు మావోయిస్ట్ ముక్త భారత్‌ను కచ్చితంగా సాధిస్తామని పేర్కొన్నారు. ప్రజలను ఉద్దేశించి నక్సలైట్లను దేశం నుంచి ఏరి పారేయాలా వద్దా అని ఆయన అన్నారు.
ఈ సందర్భంలో పాకిస్తాన్‌కి గట్టి బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్‌ను కూడా అమిత్ షా గుర్తు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాక్ పేరు తప్ప మరేం గుర్తు పెట్టుకోరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పసుపు రైతులకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెబుతూ.. ఉగ్రవాదం, మావోయిస్టు కల్లోలం తగ్గించడంలో కూడా బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టంగా చెప్పేశారు. నిజామాబాద్ సభలో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.