కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని “హిందీయా”గా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఐక్యత అని, కానీ బీజేపీ మాత్రం హిందీ భాషను బలవంతంగా అందరికీ రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో త్రిభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సాధించాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో రాజకీయ పార్టీలు ఈ రోజు సమావేశమై కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టాయి. ఈ సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, “మనమంతా ఇండియాగా ఆలోచిస్తున్నాం. కానీ బీజేపీ మాత్రం హిందీయా కలలు కంటోంది” అని వ్యాఖ్యానించారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్టీలు తీర్మానం పంపాయి.
2019లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కమల్ హాసన్ తన వ్యాఖ్యలను మరింత ఉద్దేశ్యపూర్వకంగా చేశారు. అప్పట్లో, “భారతదేశం అంటే హిందీ గుర్తు వస్తుంది” అని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా చెప్పిన వ్యాఖ్యలకు స్టాలిన్ “ఇది ఇండియా… హిందీయా కాదు” అని ఘాటు సమాధానం ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానం వంటి కీలక విషయాల్లో బీజేపీ వలస పాలన విధానం అమలు చేస్తోందని తమిళనాడు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. హిందీని బలవంతంగా వ్యాప్తి చేయడం, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేయడం అన్నీ ఒకే వ్యూహంలో భాగమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.