తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర, తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ భేటీ కానున్నారట. ఇది, పేరుకే ముఖ్యమంత్రుల సమావేశం.. కానీ, అసలు కథ వేరే వుంది. భారత్ రాష్ట్ర సమితి అధినేతకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకీ.. మధ్యన జరగనున్న భేటీ అట ఇది.!
త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దరిమిలా, తెలంగాణలోని ఆంధ్రా సెటిలర్ల ఓట్లకు గాలం వేసే క్రమంలో, వైసీపీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్. గతంలో.. అంటే, 2019 ఎన్నికల సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి, గులాబీ పార్టీ తెరవెనుకాల సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే.
మరి, దానికి వైఎస్ జగన్ బదులు తీర్చుకుంటారా.? వైసీపీ తరఫున, తెరవెనుకాల గులాబీ పార్టీకి మద్దతిస్తారా.? అదే జరిగితే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పరిస్థితేంటి.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్. వాటికి త్వరలోనే సమాధానాలు దొరకనున్నాయి. ఎటూ, తెలంగాణలో పార్టీని ఎత్తేయాలన్న ఆలోచనతో వున్నారు వైఎస్ షర్మిల.. అది వేరే సంగతి.
ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలకు పరిష్కారమంటూ, ఓ ప్రతిపాదనను స్వయంగా కేసీయార్ తెరపైకి తీసుకురాబోతున్నారట. ఈ వంకతోనే వైఎస్ జగన్‌తో కేసీయార్ భేటీ అవుతారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేసీయార్ కాకపోతే, కేటీయార్ అయినా జగన్‌ని కలిసే అవకాశం వుందట.
ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడమా.? తెలంగాణకి రప్పించడమా.? అన్నదానిపై కేసీయార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.