ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త ప్రవాహంలో పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా దేవుళ్లు, దేవాలయాలు, మతాలు అంటూ రాజకీయ పార్టీలు గోల చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆలయాల మీద వరుస దాడులు జరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో దాడులు. ఎవ్బరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఇప్పటికీ తేలలేదు. బిట్రగుంట, అంతర్వేది లాంటి ఘటనలు జరిగినప్పుడే జగన్ సర్కార్ జాగ్రత్త పడలేదు. అందుకే వ్యవహారం ఇంతవరకు వచ్చింది. ఎవరు కాదన్నా ఇదే వాస్తవం. ఈ దాడుల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయో లేదో తెలీదు కానీ ఫలితం మాత్రం రాజకీయమే అయింది. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు తమ ప్రత్యర్థుల మీద నెపం నెట్టేస్తున్నారు.
టీడీపీ ఏమో వైసీపీ చేసిందని, వైసీపీ ఏమో టీడీపీ చేయిస్తోందని, బీజేపీ వచ్చి వైసీపీ, టీడీపీలు కలిసి చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇదంతా బీజేపీ పనేనని అంటున్నారు. దీంతో జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేవుళ్ళ మీద దాడులనే విపరీత చర్యను తట్టుకోలేకపోతున్నారు. తన్నుకోవడం ఆపి అసలు కుట్రదారులను పట్టుకోమని పార్టీలను, నాయకులను కోరుతున్నారు. ఈ రాజకీయ క్రీడ ఎక్కడ వరకు వెళ్తుందో చెప్పలేం. ఈ గందరగోళ పరిస్థితిని తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్తగా గమనిస్తున్నారట. దక్షిణాదిన పుట్టుకొచ్చిన ఈ మత రాజకీయం తమ రాష్ట్రం మీదకు మళ్లితే పరిస్థితేమిటని ముందు జాగ్రత్తల్లో ఉన్నారట.
అసలే ఈమధ్య కేసీఆర్ ప్రభ తగ్గింది. బీజేపీ ఊహించని రీతిలో పుంజుకుని దెబ్బ మీద దెబ్బ కొట్టింది. దీంతో కేసీఆర్ మునుపటి కంటే ఎక్కువ జాగురకతతో ఉన్నారు. ప్రత్యర్థులకు అసలు ఆస్కారం ఇవ్వకూడదని పనిచేస్తున్నారు. వ్యతిరేకతతో ఉన్న ప్రజల్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో గనుక ఏపీలో జరిగినట్టే తెలంగాణలో కూడ దేవాలయాల మీద దాడులు అంటే ప్రభుత్వానికి పెద్ద నష్టమే జరుగుతుంది. కేసీఆర్ సర్కార్ కూడ ప్రజెంట్ జగన్ సర్కార్ ఎలాగైతే కుట్రదారులను పట్టుకోలేక విమర్శలకే పరితమైందో అలా పరిమితమైతే ప్రజల ఆగ్రహానికి గట్టిగా గురికావాల్సి ఉంటుంది.
ఏపీలో ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కూల్చబడిన గుళ్లకు శంఖుస్థాపన అంటూ ఏదో ఉపశమన చర్యలు తీసుకుంటోంది కానీ త్వరలో కుట్రదారులను కనుగొనకలేకపోయినా, ఇంకా దాడులు కొనసాగినా ప్రజల ముందు తలవంచుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ చూసిన కేసీఆర్ అలాంటి క్లిష్ట పరిస్థితులు రాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలే తెలంగాణలో ప్రజలకు దేవుడి సెంటిమెంట్ చాలా ఎక్కువ. దేవుడి జోలికొస్తే వారి రియాక్షన్ హెవీగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ముందే జాగ్రత్తపడటం చాలా మంచి విషయం.
Keywords: KCR, Andhrapradesh, Telangana, TRS, YS Jagan, YSRCP, Attacks On AP Temples, కేసీఆర్, వైఎస్ జగన్, తెలంగాణ, దేవాలయాల మీద దాడులు, వైసీపీ, ఆంధ్రప్రదేశ్