బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తరువాత మళ్ళీ బిజీబిజీగా మారబోతున్నారు. అసలైన్ పొలిటికల్ గేమ్ ప్లాన్ తో ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 8న మధ్యాహ్నం 1 గంటకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం మెదక్ జిల్లా ఎర్రవెల్లి వద్ద ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరగనుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రకటించారు.
పార్టీకి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలు చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటవుతుందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు కొత్త తరహా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించే అవకాశం ఉంది. అధికార పార్టీ పొరపాట్లను జనాల్లోకి బలంగా తీసుకు వెళ్లాలనే ప్రణాళికలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, అధికార పార్ట్ విమర్శలకు సమాధానాలివ్వడం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. ఇదిలా ఉంటే, కేటీఆర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నాలుగేళ్ళ అనంతరం సరిచేస్తామని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తగిన గౌరవంతో తన స్థానంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అంశంపై కేటీఆర్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు.
మొత్తం మీద, ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ వ్యాఖ్యలు, కేసీఆర్ సూచనలతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మరింత చురుకుగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.